Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా గవర్నర్ తీరు
- తెలంగాణ చరిత్రకు బీజేపీ వక్రభాష్యం
- నిజాంకు హిందువులైన భూస్వాములు, పెత్తందార్లు మద్దతివ్వలేదా..?
- విద్యారంగంలో అసమానతలతోపాటు సైద్ధాంతిక పోరాటంలోనూ ముందుండాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్
కరీంనగర్ నుంచి బొల్లె జగదీశ్వర్ : 'తెలంగాణ చరిత్రకు బీజేపీ వక్రభాష్యం చెబుతున్నది. సెప్టెంబర్ 17ను విమోచన దినమంటూ ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఆ పార్టీ వక్రభాష్యాన్ని గవర్నర్ సమర్థిస్తున్నారు. ముస్లిం రాజైన నిజాం నవాబుకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారంటూ బీజేపీ చెబుతున్నది. అదే నిజమైతే ఆనాడు నవాబును జైల్లో నిర్బంధించాలి.. లేదంటే అంతమొందించాలి. కానీ నాటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు తెలంగాణ రాజ్ప్రముఖ్ బిరుదినిచ్చి ఆ పదవిలో నియమించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీంరజ్వీని గౌరవ మర్యాదలతో పాకిస్తాన్కు పంపింది. నిజాం ఫ్యూడల్ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లాఖాన్ వంటి ముస్లింలు సైతం పోరాటం చేశారు. కానీ హిందువులైన భూస్వాములు, పెత్తందార్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి వాస్తవాలను ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలి...' అని శాసనమండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్... ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర నాలుగో మహాసభలు కరీంనగర్లో కొనసాగుతున్న సంగతి విదితమే. మహాసభల్లో రెండో రోజైన గురువారం ప్రతినిధుల సభను నాగేశ్వర్ ప్రారంభించి, ప్రసంగించారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐ జెండాను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. మూర్తితోపాటు ఎం.పూజ, శ్రీకాంత్వర్మ, ఎస్. రజనీకాంత్, కె.ప్రశాంత్, శిరీష, ఆత్రం నగేశ్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
నాగేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగం, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాదంతోపాటు సమైక్య భారత్ అనే భావనపై కేంద్రంలోని బీజేపీ తీవ్రమైన దాడి చేస్తున్నదని విమర్శించారు. భారత్ అంటే అనేక మతాలు, కులాలు, జాతులు, భాషలు, సంస్కృతుల సమ్మేళమని చెప్పారు. అందుకు భిన్నంగా బీజేపీ ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి అని చెప్తున్నదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయుల భాష హిందీ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అలాంటప్పుడు రాజ్యాంగం ఆమోదించిన ఇతర భాషల సంగతేంటని ప్రశ్నించారు. భారతదేశ ఆత్మ హిందీ అంటూ షా వ్యాఖ్యానించారనీ, అయితే తెలుగు ప్రేతాత్మ అవుతుందా? అంటూ నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. ఖలిస్తాన్ ఉద్యమ సమయంలో 'మాదేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం'అంటూ ఎస్ఎఫ్ఐ దేశమంతటా అదే నినాదంపై ఆధారపడి పోరాటం చేసిందని గుర్తు చేశారు. నేడు దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆధిపత్య భావజాలాన్ని భారతీయ సంస్కృతి అంగీకరించబోదని స్పష్టం చేశారు. అందుకే ఆ పార్టీ మతోన్మాద చర్యలతో విద్వేషాలను పెంచుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో కుల, మత జాఢ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
విజ్ఞానంతోనే బంగారు తెలంగాణ...
విద్యతోనే విజ్ఞానం వస్తుందనీ, ఆ విజ్ఞానంతోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని నాగేశ్వర్ ఈ సందర్భంగా చెప్పారు. నాణ్యమైన విద్యతోపాటు ఉపాధి అవకాశాలు, సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో తలసరి ఆదాయంలో 205 దేశాల్లో భారత్ 158వ స్థానంలో, మానవాభివృద్ధి సూచిలో 132వ స్థానంలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద పెరుగు తున్నా అది కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోకే వెళుతున్నదని తెలిపారు. ఈ కాలంలో అదానీ ఆస్తులు రూ.11 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. దేశంలోని యువతకు ఉద్యోగావకాశాల్లేకపోవటంతో వారు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉద్యోగ భద్రత లేక శ్రమదోపిడీకి గురవుతున్నారని వివరించారు. అసర్ నివేదిక ప్రకారం దేశంలోని ఐదో తరగతి విద్యార్థులు మూడో తరగతి పాఠాలను చదవలేకపోతున్నారు.. ఎనిమిదో తరగతి విద్యార్థులు ఐదో తరగతి లెక్కలను చేయలేకపోతున్నారని విశ్లేషించారు. ఈ క్రమంలో విద్యార్థులు, యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
కోవిడ్ తర్వాత విద్యారంగంలో అసమానతలు పెరిగాయని నాగేశ్వర్ తెలిపారు. అయితే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రయివేటు విద్యావ్యాపారాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ విద్యకు నిధులు కేటాయించకుండా, వసతులను మెరుగుపర్చకుండా, బోధన, బోధనతర సిబ్బందిని నియమించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల మరో ఐదు ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో విద్యారంగ పరిరక్షణ, అసమానతలు, నాణ్యమైన విద్య కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐలో పనిచేసే వారు చదువుతూ పోరాడాలనీ, అన్ని అంశాలపై పట్టుండేలా సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగాలని కోరారు. సైద్ధాంతిక భావజాలంపై పట్టును పెంచుకోవటంతోపాటు ప్రగతిశీల ఆలోచనలను విద్యార్థుల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను, రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, ఉపాధ్యక్షులు తాటికొండ రవి, ఎండీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.