Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
- రాష్ట్ర ప్రజలకు గర్వకారణమంటూ వ్యాఖ్య
- ఆనతికాలంలోనే దేశానికి రాష్ట్రం ఆదర్శం
- సబ్బండవర్గాలకు సుమున్నత స్థాయి
- ఫెడరల్ స్ఫూర్తితోనే సమాన హక్కులు, అవకాశాలు
- పార్లమెంటుకూ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం నిర్ణయించింది.దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.ఈ మేరకు సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించిన వెంటనే జీవో జారీ అయింది. ఈ మేరకు సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన, రాష్ట్రం ఏర్పాటైన అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలువడం వెనుక డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయని గుర్తుచేశారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3ని పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా తరగతులతో పాటు అగ్రకుల పేద ప్రజలకూ మానవీయ పాలన అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నదని వివరించారు. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని తరగతులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయనే అంబేద్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తున్నదని అన్నారు. భారతదేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని తరగతులు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత అని, అప్పుడే నిజమైన భారతం ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకోసం మావంతు కషి కొనసాగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు.
భారత నూతన పార్లమెంట్ భవనానికి సైతం అంబేద్కర్ పేరును పెట్టాలంటూ ఏదో ఆషామాషీగా కోరడం లేదనీ, భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించింది, మరో పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామన్నారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తు చేశారు. ఇదే విషయమై భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖ రాయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని తాను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జై బీం, జై తెలంగాణ, జై భారత్ అని అన్నారు.
మంత్రులు, ఇతరుల హర్షం
కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత గొప్పదని అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అంబేద్కర్‌కు హైదరాబాద్‌లో భారీ విగ్రహాం ఏర్పాటుకు పూనుకోవడం ద్వారా రాజ్యాంగ నిర్మాత గౌరవం పెంచారని చెప్పారు. ఇప్పుడు ఏకంగా సచివాలయానికి ఆయన పేరు పెట్టడం ఆయన గౌరవాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చారని పేర్నొన్నారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు పి. సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్‌గౌడ్, పీయూసీ చైర్మెన్ ఎ.జీవన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పద్దిరాజు రవిచంద్ర, ప్రజాగాయకుడు గద్దర్, ఎంపీ నామా నాగేశ్వర్రావు తదితరులు వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్ చేశారు.
జీవో జారీ
సీఎం ఆదేశాల మేరకు కొత్త సచివాలయానికి 'డాక్డర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం' గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రత్యేకంగా జీవో నెంబర్ 111ను జారీ చేశారు. ప్రభుత్వ గెజిట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నతాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు.