Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీది దేశభక్తి కాదు.. దేశద్రోహ చరిత్ర
- మతతత్వ బీజేపీని తరిమికొట్టేందుకే టీఆర్ఎస్కు మద్దతు
- సమరయోధులకు సన్మానం
- బైరాన్పల్లి బురుజు వద్ద నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవ తెలంగాణ-మద్దూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి స్తూపం, బురుజు వద్ద గురువారం ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డితో కలిసి ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. నాడు రాయి నుంచి ఒడిసెల, ఒడిసెల నుంచి గుతుపల సంఘాలు, గుతుపల సంఘాల నుంచి తుపాకుల వరకు సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. అప్పట్లో నిజాం జాగీర్దారీ, భూస్వాముల పేర్ల మీదనే భూములు ఉండేవన్నారు. వారికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం మొదలు పెట్టారని తెలిపారు. నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న ఐలమ్మను చూసి ఓర్వలేని విసునూర్ రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ ఆమెను అనేక ఇబ్బందులు పెట్టినా భయపడకపోవడంతో కోర్టులో కేసులు వేసి ఇబ్బంది పెట్టారన్నారు. ఐలమ్మ పండించిన పంటను దోచుకెళ్లేందుకు రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తే ఆమెకు అండగా ఎర్రజెండా పార్టీ నిలబడి పోరాటం చేసిందని గుర్తు చేశారు. అలా నిజాం రజాకార్లకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలకు అండగా నిలిచి పెత్తందారుల పదిలక్షల ఎకరాల భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు పంచి పెట్టిందన్నారు. ఎర్ర జెండా పట్టుకొని కడవెండిలో ఉద్యమాలు చేస్తున్న దొడ్డి కొమరయ్యను నిజాం రజాకార్లు కాల్చి చంపారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కమ్యూనిస్టు జెండా ఎగిరేదని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు చెబుతూనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలని, డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వాలని, బైరాన్పల్లి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. మునుగోడులో మతతత్వ బీజేపీ గెలవకూడదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినట్టు తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని స్పష్టంచేశారు. చుక్క రాములు మాట్లాడుతూ.. నిజాం రజాకార్ల పరిపాలనలో తెలుగు భాషను చులకనగా చూసేవారని, ఉర్దూలో మాత్రమే మాట్లాడాలని.. తెలుగు మాట్లాడితే తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారని తెలిపారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి తమ్మినేని వీరభద్రం, చుక్క రాములు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి కళావతి, కాముని గోపాలస్వామి, రాళ్ల బండి శశిధర్, నందన బోయిన ఎల్లయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, గొడ్డు బర్ల భాస్కర్, జనగామ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.