Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని 50 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా, తమ హక్కుల కోసం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాటపట్టినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురువారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ఆఫీస్బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ..73 షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్స్కు కనీస వేతనాలు సవరించాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని తప్పుబట్టారు. ఐదు రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ యాజమాన్యాల ఒత్తిడితో గెజిట్ విడుదల చేయకుండా తాత్సారం చేయడం దుర్మార్గమన్నారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచి లాభాల వాటా చెల్లించాలనీ, జీఓ.నెంబర్ 60ని, కోలిండియా ఒప్పందాలను అమలు చేయాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్మ భోజన పథకం కార్మికులకు నెలల తరబడి బిల్లులివ్వకుంటే ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాటల్లో జాతీయత, దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ ఆచరణలో దేశ విధ్వంసకర విధానాలను కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్నదని విమర్శించారు. దేశ సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నదన్నారు. మహిళలు, శ్రామిక మహిళల హక్కులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఘాతం కల్గిస్తున్నాయనీ, ప్రజాస్వామ్య - పౌర హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలకు కార్మికవర్గాన్ని బలి చేయబోతున్నదన్నారు. సమావేశంలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రాజారావు, ఎస్. వీరయ్య, టి. వీరారెడ్డి, ఆర్. కోటంరాజు, కళ్యాణం వెంకటేశ్వర్లు, జె. మల్లికార్జున్, వీఎస్రావు, పద్మశ్రీ, ఎం. నర్సింహరావు, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, జె. వెంకటేశ్, ఎస్. రమ, బి. మధు, కె. యాదానాయక్, బి.మల్లేష్, జె. చంద్రశేఖర్, ఆర్. త్రివేణి, ఎం. వెంకటేష్, కోశాధికారి వంగూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.