Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు బీజేపీ రెడ్‌కార్పెట్
- కార్మికులంతా ఐక్యతతో ముందుకెళ్లాలి
- సామ్రాజ్యవ్యతిరేక పోరాటంలో రైల్వే కార్మికులది కీలకపాత్ర
- రైలు లోక్ఫైలెట్లు మనుషులా? యంత్రాలా?:
ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ మహాసభలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముకుంటూ పోతున్నదనీ, దీనివల్ల అంతిమంగా ప్రజలకే తీవ్ర నష్టం జరుగుతున్నదని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. ప్రభుత్వ రంగ వ్యవస్థల దోపిడీకి వీలుగా ఆ పార్టీ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నదని విమర్శించారు. కార్మికులంతా ఐక్యంగా ముందుకెళ్తూ పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలనీ, తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బ్రిటీష్ సామ్రాజ్యవ్యతిరేక పోరాటంలో రైల్వే కార్మికులది కీలపాత్ర పోషించారని తెలిపారు. 1974 చారిత్రాత్మకమైన రైల్వే సమ్మెలో ఏఐఎల్ఆర్ఎస్ఏది కీలక భూమిక అని గుర్తుచేశారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసి యేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) స్వర్ణోత్సవాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ 14వ ద్వైవార్షిక మహాసభ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సాయిబాబు మాట్లాడుతూ..75 ఏండ్లుగా నిర్మించుకున్న జాతీయ సంపదను మోడీ సర్కారు నేడు ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అదానీ, అంబానీలకు కట్టబెడుతూ ప్రపంచంలోనే టాప్-10 ధనవంతుల్లో వారిని నిలిపిందని విమర్శించారు. అందులో భాగంగానే దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన రైల్వే వ్యవస్థ నిర్వీర్యానికి మోడీ సర్కారు పూనుకుని ప్రయివేటీకరిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం రైల్వే ఆస్తుల అమ్మకం ద్వారా 1,52,496 కోట్ల రూపాయలను రాబట్టుకున్నదనీ, ఇది ఏపీ, తెలంగాణ బడ్జెట్లతో సమా నమని చెప్పారు. పైగా, పెట్టుబడులకు అనుకూల పరిస్థితు లు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయనీ, ఉద్యోగాల సృష్టి జరుగు తున్నదంటూ మోడీ సర్కారు చెబుతున్న మాటలు బూటక మన్నారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని మోడీ సర్కారును ప్రశ్నించారు. గతంలో దేశంలో 20 లక్షల మందికిపైగా రైల్వే సిబ్బంది ఉంటే నేడు ఆ సంఖ్య 12.5 లక్షలకు పడి పోయిందనీ, ఖాళీలను భర్తీచేయకుండా సర్కారు నాన్చు తున్నదని విమర్శించారు. దీంతో ఉన్న సిబ్బందిపై విపరీత పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సాకు చెప్పి రైల్వే సిబ్బందికి 18 నెలల డీఏ మీద కోత పెట్టడం దారుణమన్నారు. ట్రైన్ రన్నింగ్ సిబ్బందికి మైలేజీ రూపంలో దక్కాల్సిన 30 శాతం పేఎలిమెంట్ చెల్లించలేదని విమర్శించారు. జీతాలు పెంచకపోగా ఉన్న హక్కుల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. 46 గంటల వారాంతపు విశ్రాంతిని కల్పించాలన్నారు. లోకోక్యాబ్ లో తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఏఐఎల్ ఆర్ఎస్ఏ లేవనెత్తుతున్న 26 డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మహాసభల రిసెప్షన్ కమిటీ కన్వీనర్ టి.హనుమయ్య మాట్లాడుతూ...ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ పోరాటాలు, విజయాలను విడమర్చి చెప్పారు. ఆ సంఘం దక్షిణమధ్య రైల్వే జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సూర్యకుమార్ అరుణపతాకాన్ని ఎగురవేశారు.
పలువురికి సంతాపం
కోవిడ్ కాలంలో, రైలు ప్రమాదాల్లో చనిపోయిన లోకోఫైలెట్లు, ఆ సంఘం అభివృద్ధికి కృషి చేసి ఇటీవల మరణించిన ఎన్.సర్కారు, సీహెచ్ నారాయణరావు, ముత్యాల రామకృష్ణయ్య, శివరాం, జాకరయ్య, ఆర్. బలరామయ్య, జీజీరావు, టీఆర్ చౌదరి, రైతాంగ, అగ్నిపథ్ ఆందోళనలో చనిపోయినవారికి సభ నివాళుల ర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించింది.
గురుమూర్తి ఆత్మీయ వీడ్కోలు
ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యదర్శి ఎస్.గురుమూర్తి అనారోగ్య కారణాలతో రిలీవ్ అయ్యారు. ఆయన్నుఎం.సాయిబాబు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ముఖ్య నాయకులు శ్రీజిత్, ఎస్డీ జిలానీ, సుధీర్, ఎం.వెంకటేశన్, మోహన్, రామరాజు, బీవీఏఎన్రాజు, కృష్ణప్రసాద్, బి.శ్రీను, రఘుపాల్, అనీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ నూతన కమిటీ ఎన్నిక
ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ దక్షిణ మధ్య రైల్వే జోన్ నూతన కమిటీని సభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎస్.శ్రీకుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కె.సూర్యకుమార్, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులుగా ఎమ్డీవీడీ ప్రసాద్, వీకే కుట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎస్డీ జిలానీ పాషా, జాయింట్ సెక్రటరీలుగా ఎమ్. వెంకటేశన్, ఎమ్.ప్రసాద్, అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీలుగా పీఎస్.వాసులు, రాము యాదవ్, ట్రెజర్‌గా సుధీర్.కె, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.రఘు, పవన్‌కుమార్, జేవీఎన్ రావు, పి.లక్ష్మినారాయణ, శివప్రసాద్, దేవేందర్, జోనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎ.వేణుగోపాల్, నీరజ్‌కుమార్ సోనీ, నందివర్ధన్, బి.గజపతిరావులను ఎనుకున్నారు.