Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి. నర్సింహారావు, సౌత్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్
నవతెలంగాణ- ధూల్‌పేట్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, అమరుల త్యాగాలపై నేడు బీజేపీ మతం మకిలీ అంటించే ప్రయత్నం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, హైదారబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి.అబ్బాస్ డిమాండ్ చేశారు. విమోచనం పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాతబస్తీలోని శాలిబండ నుంచి చార్మినార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో డిజి.నర్సింహారావు, అబ్బాస్ మాట్లాడారు. తెలంగాణలో దున్నుకునే వారికే భూమి పంచాలని, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కావాలని, నిజాం రాచరిక వ్యవస్థను కూల్చేందుకు రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిందన్నారు. 3 వేల గ్రామాలను భూస్వాముల నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచింది కమ్యూనిస్టులేనని చెప్పారు. నాడు 4 వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసి తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని వివరించారు. ఇంతటి మహత్తర పోరాటానికి బీజేపీ మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. సాయుధ పోరాటం మతాల మధ్య జరిగిన ఘర్షణ కాదన్నారు. దోపిడీదారులైన భూస్వాముల అరాచకాలకు, వారికి అండగా నిలిచిన నిజాం నవాబుకు వ్యతిరేకంగా దోపిడీకి, అణచివేతకు గురవుతున్న హిందువులు, ముస్లింలు ఐక్యంగా సాగించిన పోరాటమని చెప్పారు. మఖ్దూమ్ మొహియిద్దీన్, షేక్ బందగి, షోయబుల్లాఖాన్ అమరులయ్యారని గుర్తుచేశారు. విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి, జన్నారం ప్రతాప్‌రెడ్డి తదితర జమీందార్ల దౌర్జన్యాలను ఎదిరించి బీంరెడ్డి నర్సింహారెడ్డి, దొడ్డి కొమురయ్య, ఐలమ్మ లాంటి ఎందరో మహనీయులు పోరాడారని చెప్పారు.
హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టుల వశం అవుతుందని భావించి నాడు కాంగ్రెసు ప్రభుత్వం, నిజాం నవాబు కలిసి కుట్ర చేసి.. కమ్యూనిస్టులను అణచివేసేందుకు సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపాడని విమర్శించారు. వేలాది మందిని ఊచకోత కోసి, లక్షలాది మందిని కాన్సంట్రేషన్ క్యాంపులలో పెట్టి హింసించారని తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఏ పాత్ర లేని సంఫ్‌ు పరివార్, బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ కమిటీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.విఠల్, మీనా, ఎల్.కోటయ్య, పి.నాగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ సత్తార్, అబ్దుల్ లతీఫ్, బాబర్ ఖాన్, ఎస్.కిషన్, ఎ.కృష్ణ, ఎం.లక్ష్మమ్మ, పి.శశికళ, పి.కల్యాణ్, శ్రీను, జ్యోతి, కవిత, స్వరూప, కె.జంగయ్య, బాలు నాయక్, రామ్ కుమార్, నాయక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.