Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరుతోనే తోక ముడిచిన నిజాం, రజాకార్లు
- సాయుధ పోరాట సారధులు కమ్యూనిస్టులు
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట బైక్ యాత్రలో.. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎర్రజెండా నాయకత్వంలో సాగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం నవాబు తోక ముడిచారని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట బైక్ యాత్ర గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఇబ్రహీంట్నంలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణలో మాత్రం నిజాంనవాబు పాలన సాగుతోందన్నారు. అప్పటికీ ఇంకా ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించలేదని, వెట్టి చాకిరి కొనసాగేదని తెలిపారు. సిస్తూ వసూళ్లు పేదలు బరించే స్థితిలో లేరన్నారు. ఆడ బిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. భూములపై ఎలాంటి హక్కులు లేవన్నారు. భారత దేశ వ్యాప్తంగా స్వతంత్ర సంబురాలు జరుపుకుంటుంటే, తెలంగాణ మాత్రం వెట్టిలోనే మగ్గిందన్నారు.
ఈ తరుణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. చాకలి ఐలయ్య వీరత్వం, దొడ్డికొమరయ్య బలిదానంతో సాయుధ పోరు మరింత ఉధృతమవడంతో నిజాం ప్రభుత్వం నిషేదం విధించిందన్నారు. ఆయుధాలు సమకూర్చుకోవడం, శత్రువుపై దాడులు చేస్తుండటంతో భూస్వాములు ఊర్లను వదిలి పట్టణాలు పట్టారన్నారు. ఈ తరుణంలో కమ్యూనిస్టు నాయకత్వంలో 10లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. 3వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పాటుచేయడంతో సిస్తూ వసూళ్లు నిలిచిపోయాయన్నారు. దాంతో చేసేది లేక భారత ప్రభుత్వానికి నిజాం నవాబు లొంగిపోయారని గుర్తు చేశారు. కానీ ఈ పోరాటానికి నేటి బీజేపీ ప్రభుత్వం వక్రభాష్యం చెబుతోందన్నారు. బీజేపీకి ఈ పోరాటానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.యాదయ్య, సామెల్, మధుసూన్రెడ్డి, జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ జంగయ్య, జగన్, నర్సింహ, శ్యాంసుందర్, రవి, మల్లేష్, రావుల జంగయ్య, గొర్రెంకల నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.