Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పుస్తక ప్రదర్శనలో మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఆర్ఎస్ఎస్ లోతుపాతులపై పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
మనువాదంతో దేశం మళ్లీ పరాయి పాలనలోకి వెళ్లిపోతుందని.. మనువాదం వ్యాప్తి చెందడం వల్ల దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడి విద్యావ్యవస్థను సామాన్య ప్రజలకు దూరం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గురువారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పుస్తక ప్రదర్శనను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం తిరిగి మతోన్మాదశక్తులు బలం పుంజుకున్నాయన్న భావనను వ్యక్తపరిచారు. సినిమాలు, టీవీలతో ప్రభావితమైన యువత నేడు సమాజానికి దూరంగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ద్రోహశక్తులు మళ్లీ వర్ణవ్యవస్థను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయన్నారు. ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రగతిశీల శక్తులపై ఉందని చెప్పారు. మంచిపుస్తకం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందన్నారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లులక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు. కానీ బీజేపీ నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అంతకుముందు 'ఆర్ఎస్ఎస్ లోతుపాతులు' పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు ములకలపల్లి రాములు, డీఎస్పీ నాగభూష ణం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్టకిశోర్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, ఎలుగూరిగోవింద్, కోట గోపి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇన్చార్జి కృష్ణారెడ్డి, సిబ్బంది రఘువరణ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.