Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాంకు మద్దతిచ్చిన వాళ్లు దాక్కున్నారు
- నెహ్రూ ఆదేశంమేరకే పటేల్ నడిచారు:వీహెచ్ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదనీ, ఆ వాస్తవాన్ని మరుగుపరచాలనినీ, వారే పోరాటం చేసినట్టు ఆ పార్టీ నేతలు చెపుకుంటున్నారని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. ఆ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రు ఆదేశాలమేరకే హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభారు పటేల్ మిలటరీని తీసుకొచ్చారని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆనాడు నిజాంకు మద్దతు ఇచ్చిన వాళ్లు ఎక్కడో దాక్కున్నారని విమర్శించారు. ఆనాటి చరిత్ర వారికి తెలియదని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆ పార్టీ ముందు వరుసలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోరాటంలో ఆర్యసమాజ్ పోరాడిందని గుర్తు చేశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటే కోర్టు ఆర్డర్ ఉందంటూ కేటీఆర్ చెప్పడం సరైందికాదన్నారు. ఎన్ని విగ్రహాలకు అనుమతి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
పట్టాదారుల భూమికి అడవి పేరా? :మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్
పట్టాదారుల భూములను అడవుల పేరుతో ఎలా నమోదు చేస్తారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం నారాయణపురంలో ధరణిలో తప్పుగా నమోదు చేసి, 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దకపోతే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమస్యను జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.