Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి
- సీఎం కేసీఆర్కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ, కారోబార్లు, బిల్కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం ఈ మేరకు సీఎం కేసీఆర్కు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు లేఖ రాశారు. జీవోనెంబర్ 51లో గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు నష్టం చేకూర్చే అంశాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ కేటగిరీలను రద్దు చేసి, మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకురావడం సరిగాదని తెలిపారు. సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన కారోబార్, బిల్ కలెక్టర్లతో మోరీలు తీయించడం, ట్రాక్టర్లు నడిపించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సబబు కాదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచినట్టుగానే జీఓ నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా కార్మికులకు రూ.15,600, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22,750 చొప్పున వేతనాలు ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల్లో అత్యధికులు దళిత, గిరిజన, బలహీన సామాజిక తరగతుల వారే ఉన్నందున వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని సీఎంను లేఖలో కోరారు.