Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యకు యత్నించిన నలుగురు
- చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా అందరూ మృతి
నవతెలంగాణ- జగిత్యాల
అప్పులు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. కుటుంబ పెద్ద తీసుకున్న క్షణికావేశ నిర్ణయంతో నలుగురు ప్రాణం తీసుకున్నారు. అభం, శుభం తెలియని ఇద్దరు పిల్లలు అసువులు బాసారు. గత నెల 20న కుటుంబం ఆత్మహత్యకు యత్నించగా.. కొన ఊపిరితో ఉన్న వారిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ పెద్ద కృష్ణమూర్తి చికిత్స పొందుతూ గత నెల 25న మృతిచెందాడు. ఆ తరువాత ఒక్కొక్కరుగా పిల్లలు.. గురువారం కృష్ణ భార్య శైలజ కూడా ప్రాణం కోల్పోయింది. వివరాలిలా ఉన్నాయి..జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన అకోజు కృష్ణమూర్తి(40) బంగారు నగలు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ పోషణకు కృష్ణ కొంత అప్పు చేసినట్టు తెలిసింది. అయితే, కరోనా సమయంలో పనిలేకపోవడంతో ఆదాయం రాలేదు. ఆ తర్వాత అప్పులు పెరిగాయి. వాటిని ఎలా తీర్చాలో పాలుపోక కలత చెందిన కృష్ణమూర్తి గత నెల 20న ఇద్దరు పిల్లలు, భార్యకు పురుగుల మందు తాగించి.. తానూ తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో కృష్ణమూర్తి గత నెల 25న మృతిచెందాడు. కుమార్తె గాయత్రి(14) సెప్టెంబర్ 5, కుమారుడు ఆశ్రీత్(16) 14న చనిపోయారు. గురువారం కృష్ణమూర్తి భార్య శైలజ(35) కూడా చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పుల విషయమే తెలియని కృష్ణమూర్తి భార్య శైలజ, తెలిసీ తెలియని వయసులో ఉన్న కుమారుడు ఆశ్రిత్, కుమార్తె గాయత్రి మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.