Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ యత్నం
- సిరిసిల్లలో మంత్రి కె.తారకరామారావు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
- అంబానీ, ఆదానీల మీద ఉన్న ప్రేమ అంబేద్కర్ మీద లేదు
- త్యాగధనుల పోరాట ఫలమే రాచరిక పాలన అంతం : మంత్రి హరీశ్‌రావు
- రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్/ వేములవాడ/ విలేకరులు
''ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కొందరు కావాలని మతవిద్వేషాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు.. విచ్ఛిన్నకర శక్తులకు పోరాటాల గడ్డ తెలంగాణలో స్థానం లేదు.. మాట్లాడితే హిందూ, ముస్లిం తప్ప పైసా తెచ్చిన చరిత్ర ఉందా? పిచ్చి మాటలు, బక్వాస్, బోగస్ మాటలు తప్ప మరేం లేదు.. ప్రజలు అప్రమత్తం ఉండాలి'' అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం అన్ని జిల్లాల్లో సభలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడలో బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భూమి కోసం, భుక్తి, మాతృగడ్డ విముక్తి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు. తెలంగాణ నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం మూడ్రోజులపాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటే.. బీజేపీ పోటీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నదో స్పష్టం చేయాలన్నారు. ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన చరిత్ర మీకుందా అని ప్రశ్నించారు. మత పిచ్చిలేపి తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ దశాబ్దాల పాటు వెనక్కి పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రానికి అంబానీ, ఆదానీల మీద ఉన్న ప్రేమ అంబేద్కర్ మీద లేదన్నారు. బడా వ్యాపారులకు రూ.12లక్షల కోట్లు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడితే హిందూ, ముస్లిం అంటున్నారు తప్ప వారికి పైసా తెచ్చిన చరిత్ర లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన తాతతో పాటుగా అమృత్లాల్ శుక్లా, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, అణభేరి ప్రభాకర్ వంటి వారు ఎంతో మంది పాల్గొన్నారని, మరి మీ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడికి అయిన ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉందా అని బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తాము భారతరత్న అంబేద్కర్ పేరు తెలంగాణ సచివాలయానికి పెట్టామని, మీకు దమ్ముంటే దేశ పార్లమెంట్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టండని సవాలు విసిరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే రామేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంపై తప్పు మాట్లాడితే నోటిశుధ్ధి, దేహశుద్ధి !: హరీశ్‌రావు
ప్రజాపోరాటాల ఫలితంగానే రాచరిక పాలన అంతమొంది ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చామని ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ది పేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. భిన్న భాషలు, మతాలు ఉన్నప్పటికీ భారతదేశం సమైఖ్యంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అద్భుత నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్‌లో మరొ కరు టీవీ డిబెట్లలో కూర్చుని.. ప్రాజెక్టు ద్వారా ఎకరం నీరు పారింది లేదని మాట్లాడుతున్నారు.. మన ప్రాంతం దిక్కు వచ్చే వారికి కాళేశ్వరం నీటిని చూపించి నోటి శుద్ధి, దేహశుద్ధి చేసి పంపిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ర్యాలీని చూస్తుంటే సమైక్యత స్ఫూర్తి కనిపిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి పాల శీతలీకరణ కేంద్రం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు జిల్లాలో రెండు జీవనదులు ప్రవహిస్తున్న నీటి కోసం కొట్లాడుతున్న పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానం నుంచి బాలురాజ్ జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.
కులాలు,మతాల పేరుతో విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
కులాలు, మతాల పేరుతో విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలకు తెరలేపుతోందని, ఆ ఉచ్చులో తెలంగాణా సమాజం పడొద్దని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమగ్రతా ర్యాలీని నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక అని, అది యావత్ భారతదేశానికి చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 17న జరుపుకునేది ముమ్మాటికీ జాతీయ సమైక్యతా దినోత్సవమేనని స్పష్టం చేశారు.
పోరాటాలతో విలీనం.. : శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
వందల ఏండ్ల నైజాం స్వతంత్ర పాలన నుంచి పోరాటాలతో హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నల్ల గొండ మిర్యాలగూడలో జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అధికారం కోసం మత రాజకీయా లను ప్రోత్సహిస్తున్న వారిని ప్రజలు గుర్తించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ సమగ్రతను బలపర్చాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని విమర్శించారు.
సమైక్యతా ర్యాలీలో కూలిన ఎల్ఈడి స్క్రీన్
మిర్యాలగూడ పట్టణంలో సమైక్యతా ర్యాలీలో ఆపశ్రుతి చోటుచేసుకుంది. భారీ ఎల్ఈడి స్క్రీన్ ఒక్కసారిగా కూలి దాని సమీపంలో ఉన్న విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో కాకతీయ పాఠశాలకు చెందిన సుమారు పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ప్రయివేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించా రు. మంచిర్యాల చౌరస్తా శివాజీచౌక్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
ర్యాలీల వెంట 108 అంబులెన్స్‌లో డాక్టర్లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవ డంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బందు లకు గురయ్యారు. అయితే, కొన్నిచోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారి ని వెంటనే అధికారులు ఆస్పత్రికి చేర్చి చికిత్స అందించారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వజ్రోత్సవ వేడుకల కార్య క్రమంలో కనీసం టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. మహిళలు, విద్యార్థులు ఎండ వేడిమి తట్టుకోలేక ప్రసంగం మధ్యలోనే తిరిగి వెళ్లారు. తాగేందుకు నీటి సదుపాయం కూడా లేకపోవటంతో మహిళలకు అనేక అవస్థలు పడ్డారు.