Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గేదెలు ఇవ్వండని 'దళితబంధు' లబ్దిదారుల వేడుకోలు
- ఎకరానికి రూ.10-20వేలు చెల్లించి భూమి కౌలు
- మూడు నెలలుగా నిరుపయోగంగా షెడ్లు
- చింతకానిలో 571 గేదెల యూనిట్లకు గాను 66 మాత్రమే గ్రౌండింగ్
- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3945 మందికి నగదు పంపిణీ : కలెక్టర్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'గడ్డి ముదురుతోంది గేదెలు పంపిణీ చేయండి..' అని దళితబంధు లబ్దిదారులు అధికారులను అడుగుతున్నారు. మూడు నెలల కిందట షెడ్లు నిర్మించి గేదెల కోసం ఎదురుచూస్తున్నారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.20వేల చొప్పున భూమి కౌలుకు తీసుకున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి మొత్తం 571 యూనిట్లు మంజూరు కాగా 366 మంది షెడ్లు నిర్మించారు. ఇప్పటికీ 66 మందికి రూ.3.4 లక్షల విలువ చేసే నాలుగు గేదెల చొప్పున పంపిణీ చేశారు. లబ్దిదారులందరి ఖాతాల్లో రూ.9.9లక్షల చొప్పున నగదు జమ చేశామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఇటీవల ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 3,945 మందికి పూర్తిస్థాయిలో నగదు జమ చేశామన్నారు. చింతకాని మండలంలో 3,462 మందికి, నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఐదు నియోజకవర్గాల్లో 483 మందికి పూర్తిస్థాయిలో నగదు వేసినట్టు అధికారులు చెబుతున్నారు. చాలా మందికి అరకొర నిధులు మాత్రమే జవయ్యాయని పలువురు లబ్దిదారులు తెలిపారు.
గేదెల రైతుల దీనగాథ..
చింతకాని మండలానికి చెందిన లబ్దిదారుల్లో 571 మంది డెయిరీ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 66 మందికి రూ.3.4 లక్షల విలువైన నాలుగు గేదెల చొప్పున మంజూరు కాగా మిగిలిన వారంతా ఎదురుచూస్తున్నారు. సుమారు 400 మంది రూ.1.50 లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించారు. ఎకరం భూమి రూ.20వేల చొప్పున కౌలుకు తీసుకుని జున్ను, జొన్న గడ్డి పెంచుతున్నారు. 75శాతం సబ్సిడీపై పశుసంవర్థకశాఖ పంపిణీ చేసిన విత్తనాలతో ఈ గడ్డి గింజలు నాటారు. ఇప్పటికే వీటిని వేసి మూడు నెలలు అవుతోంది. ఓవైపు గడ్డి ముదురుతోందని కొందరు లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు దున్నుడు కూళ్లు, కౌలు డబ్బులైనా మంజూరు చేయాలని కోరుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక బయట అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు. ముదిరిన గడ్డితో సహా వచ్చి ఈనెల 12వ తేదీన గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశారు. కర్నాటక, తమిళనాడు గేదెలు వద్దని, ఆంధ్రప్రదేశ్ పశువులు మాత్రమే ఇవ్వాలని కూడా లబ్దిదారులు కోరారు. ఇక్కడి వాతావరణం సరిపడక బయటి రాష్ట్రాల గేదెలు రోగాల బారిన పడుతున్నాయని గ్రీవెన్స్‌లో విన్నవించారు. ఖమ్మంలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్ల్టు తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో సైతం దళితబంధు లబిదారులు ఫిర్యాదు చేశారు. తమకు యూనిట్లు మంజూరు కాలేదని ఇల్లందకుంట మండలం లోని పలు గ్రామాల దళితులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
గణాంకాల్లోనే నగదు జమ..
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3,462 మంది లబ్దిదారులకు 346.20 కోట్లు, నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఐదు నియోజకవర్గాల్లోని 483 మందికి రూ.48.30 కోట్లు ఖాతాలో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. ఒక్కొక్కరికి రూ.9.90 లక్షల చొప్పున జిల్లావ్యాప్తంగా 3,945 మందికి పూర్తిస్థాయిలో నగదు వేసినట్లు పేర్కొన్నారు. దళితబంధు రక్షణ నిధి కింద ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.10వేల చొప్పున రూ.3.94 కోట్లు జమ చేశామన్నారు. చింతకాని మండలంలో 1052 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని గణాంకాలు చూపుతున్నా.. వీరిలోనూ పూర్తిస్థాయిలో నగదు జమకాని వారు అనేక మంది ఉన్నట్టు తెలుస్తోంది.
కౌలు, దున్నుడు కూళ్లకు డబ్బులు లేవు..
కనీసం కౌలు, దున్నుడు కూళ్ల కోసమైనా డబ్బులియ్యాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. రూ.1.50 లక్షలతో షెడ్డు నిర్మించాం. రూ.20వేలకు ఎకరం చొప్పున భూమి కౌలుకు తీసుకున్నాం. గడ్డి పెంచుకోవడానికి డబ్బులు లేవు. కౌలు డబ్బులు చెల్లించాలి. ఈడబ్బుల మందమైనా మంజూరు చేయాలి. ఇప్పటికైనా గేదెలు తక్షణం ఇవ్వాలి.
- పగిడిపల్లి నవిత, చింతకాని
గడ్డి ముదురుతోంది...తక్షణం గేదెలు ఇవ్వాలి..
షెడ్డు నిర్మించి ఇప్పటికీ మూడునెలలైంది. రూ.20వేలు పెట్టి ఎకరం భూమి కౌలుకు తీసుకున్నాం. దానిలో వేసిన గడ్డి ముదురు తోంది. ఉపయోగం లేకుండా పోతుంది. అధికారులనడిగితే ఇదుగో అదుగో అంటున్నారు. కర్నాటక, తమిళనాడు గేదెలు ఇస్తున్నారు. అవి ఇక్కడి వాతావరణానికి సరిపడక రోగాలు వస్తున్నాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గేదెలు మాత్రమే మాకు కావాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఇచ్చే డబ్బులు కూడా మొత్తం ఒకేసారి ఇస్తే మాకూ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
- చాట్ల వెంకటేశ్వర్లు, నాగిలిగొండ.