Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో 'నార్త్' వింగ్ పనులకు శ్రీకారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల్లోనే భారీ మార్పులు రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంబంధిత పనులు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలు కొత్త కళను సంతరించుకోనున్నాయి. ప్రజారవాణా మెరుగుపడనుంది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇదివరకే ఉన్న దక్షిణాది వైపు కూడా సమగ్ర ప్రాజెక్టు నివేదిక( డీపీఆర్) తయారికి జాతీయ రహదారుల అథారిటీ సంస్థ(ఎన్హెచ్ఏఐ) అనుమతించింది. ఇప్పటికే ఆందోల్, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో భూ సేకరణకు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసిన విషయం తెలిసిందే. ఇది పూర్తయితే ఎన్హెచ్ఏఐ ఆర్ఆర్ఆర్ నిర్మాణన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలావుండగా ఆర్ఆర్ఆర్ను గ్రీన్‌ఫీల్డ్ హైవేగా కేంద్రం గుర్తించింది. ఆమేరకు దానికి 166ఏఏ నెంబరు కేటాయించినట్టు ఎన్హెచ్ఐఏ ప్రాంతీయ అధికారులు చెప్పారు.
11 చోట్ల ఇంటర్ఛేంజర్లు
రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో ఇంటర్ఛేంజర్లు నిర్మించే ప్రాంతాల ఎంపిక సైతం పూర్తయింది. గ్రీన్‌ఫీల్డ్ హైవేగా రూపొందిస్తున్న ఈ రహదారికి 11 ప్రాంతాల్లో ఇంటర్ఛేంజర్లను నిర్మించనున్నారు. వీటిపై ఇటీవల ఎన్హెచ్ఏఐ తుది నిర్ణయం తీసకుంది. ఇందులో చౌటుప్పల్ వద్ద ఉండే ఇంటర్ఛేంజర్కు భూసేకరణకు దాదాపు 20 అభ్యంతరాలు సైతం కాలా(కాంపీటెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అక్విజెషన్)కు వచ్చాయి. ఒక వైపు ఇంటర్ఛేంజర్లు ఫైనల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నగరం నుంచి ఆర్ఆర్ఆర్కు సులువుగా వెళ్లే విధంగా ప్రత్యేకంగా రహదారుల(సర్వీసు రోడ్లు)ను అభివద్థి చేయనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే అయిన ఆర్ఆర్ఆర్కు ఇంటర్ఛేంజర్ల వద్ద మాత్రమే అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాహనాలైనా ఇంటర్ఛేంజర్ల వద్దనే ఆర్ఆర్ఆర్ నుంచి దిగడానికి, ఎక్కడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ముందుగా ఉత్తరభాగంలో మాత్రమే రిజనల్ రింగ్ రోడ్‌కు జాతీయ రహదారుల సంస్థ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ఉత్తర భాగంలో స్పైక్ రోడ్ల నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఉత్తర భాగం తర్వాత దక్షిణ భాగానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే 'ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ప్రయివేటు లిమిటెడ్'కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతీయ రింగు రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్హెచ్ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో అలైన్మెంట్ తయారీ కసరత్తుకు శ్రీకారం చుట్టనున్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. దీంతో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగగమైంది. ఉత్తర భాగానికి నాగ్‌పూర్ కేంద్రంగా ఉండే కే అండ్ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా, దక్షిణ భాగం సర్వే కూడా అదే సంస్థకు అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతున్నది. భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం సైతం సగం భరించనుంది.
తొలి నుంచి కిరికిరే..
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తొలి నుంచి కొంత కిరికిరి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర భాగం వైపు వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుందనీ, దక్షిణ భాగం ఉండదని చెప్పుకొచ్చి ప్రాజెక్టును కొంత ఆలస్యం చేశారు. ప్రాజెక్టుకు భూసేకరణకు అయ్యే వ్యయంలో తాము 50 శాతం భరిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉపరితలరవాణా శాఖ కదిలింది. ఉత్తర భాగం సంబంధించి గెజిట్లు ఇవ్వడంతో దక్షిణ భాగానికి ఇప్పుడు పూర్తి స్థాయి కన్సల్టెన్సీ డీపీఆర్ సిద్ధం చేసేందుకు ఎన్హెచ్ఏఐ ఆదేశించింది.
ఇటు...అటు
సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్ వరకు నార్త్వింగ్ నిర్మాణం జరుగుతుంది. సుమారు 160 కిలోమీటర్లు. ఈ రోడ్డుకు తాత్కాలిక జాతీయ రహదారి నంబర్‌గా ఎన్‌హెచ్ 166ఏఏ నెంబరును కేటాయించారు. ఏడాదిలోగా అలైన్మెంట్ పూర్తి చేసి, భూసేకరణకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు డీపీఆర్ తయారీ కసరత్తు ప్రారంభించారు. నిర్మాణానికి మొత్తంగా రూ.9,500 కోట్లకుపైగా ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ అంచనా. అలాగే అదే సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు.. దాదాపు 182 కిలోమీటర్ల పొడవుంది. దీని నిర్మాణానికి మరో రూ.9,500 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ భావన.