Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్వాఘేలా ఆహ్వానం
- ప్రగతిభవన్‌లో ఐదుగంటలు భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్తమాన జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉన్నదని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా అన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీి దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలంటే, ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదనీ, కేసీఆర్‌కు దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్లో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. వారిరువురూ దాదాపు ఐదు గంటల సేపు జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేశానికి ఆదర్శంగా అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతితో పాటు దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విపరీత పోకడలు, అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాలు, దేశ ప్రజలపై దాని పర్యవసానాలనూ చర్చించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ వంటి సీనియర్ జాతీయ నేతలంతా నేటి బీజేపీరాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నారని ఈ సందర్భంగా వాఘేలా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలనా, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నదనీ, ఇలాంటి కీలక సందర్భంలో మౌనం వహించడం ప్రజాస్వామిక వాదులకు, దేశ ప్రగతి కాములకు తగదని చెప్పారు. దేశంలో ప్రజాస్వామిక ఫెడరల్ స్పూర్తిని మంటగలుపుతూ, కేంద్రంలో నియంతత్వ ధోరణి ప్రబలుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిలువరించే దిశగా సరియైన వేదిక దొరక్క, తమ లాంటి సీనయర్లను ముందుండి నడిపించే నాయకత్వం లేక కొంత ఆందోళనలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారంనాడొక ప్రకటనలో తెలిపింది. బీజేపీ పీడన నుంచి తెలంగాణతో పాటు సహచర రాష్ట్రాల ప్రజలను విముక్తం చేయాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌కు ఉన్నదని తమవంటి సీనియర్లు భావిస్తున్నారని చెప్పారని ఆ ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ తన అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా భారత దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను ఆయనతో భేటీకి రాకముందే కాంగ్రెస్ సహా పలు పార్టీల్లోని సీనియర్ నాయకులమంతా కలిసి చర్చించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా వుంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీ, నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన చెప్పారు. దేశంలోని భావసారూప్య విపక్షాలను కలుపుకుపోయేందుకు కేసీఆర్ వంటి నాయకత్వం అవసరం ఉన్నదనీ, జాతీయ నాయకత్వంలోని నేతలంగా కలిసి ఈ విషయం చెప్పేందుకే తనను పంపినట్టు వాఘేలా చెప్పారని సీఎమ్ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాఘేలా ఆహ్వానానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.