Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ కలిసి 25 స్థానాల్లో పోటీ
- ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల బరిలో..
- కేసీఆర్ వైఖరిని బట్టే టీఆర్ఎస్తో పొత్తు
- ప్రమాదకరంగా మారిన గవర్నర్ వ్యవస్థ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ - ఖమ్మం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కేసీఆర్ వైఖరి బాగుంటే టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ భవన్ (సీపీఐ కార్యాలయం)లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా 25 స్థానాల్లో పోటీ చేస్తాయని, ఉమ్మడి జిల్లాలో 5 స్థానాల్లో బరిలో ఉంటామని స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ ఎన్నికల్లో టీబీఏకేఎస్ తమకు మద్దతు ఇవ్వని పక్షంలో కచ్చితంగా ఏఐటీయాసీ బరిలో ఉంటుందన్నారు. నిజాం నవాబుపై విజయం సాధించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రని భవిష్యత్తు తరాలకు అందించేందుకు పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. త్యాగాలు కమ్యూనిస్టులవి ప్రచారం మీకా అని బీజేపీ సహ ఇతరపార్టీలను ప్రశ్నించారు.
ప్రజా క్షేత్రంలో ఎన్నికల పొత్తులు కేవలం ఒక ఎత్తుగడ మాత్రమేనని, ప్రజా సమస్యలపై రాజీలేదని సంఘటిత, అసంఘటిత, పోడు, కౌలు రైతుల సమస్యలపై, వీఆర్ఏ, అగ్రిగోల్డ్ సహా ప్రతి సమస్య పరిష్కారానికి పోరాటాలు చేస్తామని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, అమె విధులు, బాధ్యతలు మరిచి బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, ఆమె రాజకీయాలు చేయదలుచుకుంటే రాజ్‌భవన్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తీరు మారకపోతే ఆందోళన చేపడతామని, అవసరమైతే రాజ్‌భవన్ ముట్టడిస్తామన్నారు.
రాష్ట్ర కార్యవర్గసభ్యులు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్‌ను సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, సీఐ శ్రీనివాసరావును వెంటనే బదిలీ చేయాలని, లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని చెప్పారు. ఇప్పటికే సీపీకి ఫిర్యాదు చేశామని, శనివారం డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నాయకులు పోటు ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్కె. జానిమియా, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్, ఎర్రా బాబు తదితరులు పాల్గొన్నారు.