Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8వ రోజుకు చేరిన కాంట్రాక్టు కార్మికుల సమ్మె
నవతెలంగాణ-గోదావరిఖని
హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 8వ రోజు కొనసాగింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు బైటాయించి నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ పాల్గొన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ నాయకులు మెండే శ్రీనివాస్, బీజేపీ నాయకులు కౌశిక హరి, టీఎల్పీ అధ్యక్షులు గొర్రె రమేష్, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత ఈ నరేష్, ఏఐటీయూసీ నేత మడ్డి ఎల్లాగౌడ్, కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, బాలరాజ్ కుమార్, కవితా సరోజిని పాల్గొని మద్ధతు ప్రకటించారు. సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్, గుండెబోయిన భూమయ్య ఈ నిరసనకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవినీ త్యాగం చేస్తానని, కాంట్రాక్టు కార్మికుల ఉద్యమానికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అధ్యక్షవర్గం నేతలు మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవి న్యాయమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి కార్మికుడు పోరాటంలో ఉండాలని సూచించారు. ఐక్యంగా ఉండి సింగరేణి యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా కొట్లాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్లో మరిన్ని పోరాటాలు చేయాల్సి వస్తుందని, కార్మికుల పక్షాన అందరం కలిసి కొట్లాడుదామని చెప్పారు. నిరసనలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నేతలు సిహెచ్.ఉపేందర్, కొండ్ర మొగిలి, శ్యామ్, సాయి, ఓదెలు, మధు, కె.శంకర్, ఎన్.రాజేందర్ తదితరులున్నారు.
డీవైఎఫ్ఐ మద్ధతు...
రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కారానికి నిరవధిక సమ్మె చేపట్టిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) పెద్దపెల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు సాగర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.