Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చుక్కా రామయ్యను అభినందించిన టీపీఎస్కే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో సంబంధం లేనివాళ్లు నేడు సంబరాలు చేసుకోవడమేంటని తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ, పోరాట యోధుడు చుక్కా రామయ్యను టీపీఎస్కే ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలతో శనివారం హైదరాబాద్లో అభినందించారు. ఇటీవల మల్లారెడ్డి, ఎస్ వీరయ్య రచించిన తెలంగాణ సాయుధ పోరాట పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలోనే ఒక చారిత్రక ఘట్టమనీ, మహత్తర పోరాటమని అన్నారు. ఇది ఫ్యూడల్ నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిందన్నారు. ఇంత గొప్ప పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని చెప్పారు. వాళ్లే జైల్లోకి వెళ్లి చిత్రహింసలను అనుభవించారని గుర్తు చేశారు. రజాకార్ల తుపాకీ తూటాలకు బలైంది వాళ్లేననీ, వేల మంది చనిపోయారని అన్నారు. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా దీనికి ఎవరు ఏ పేరు పెట్టినా ఇది మాత్రమే వాస్తవమనీ, చరిత్ర అని ఆయన వివరించారు. ఆనాడు 1936లో సామాజిక, సాంస్కృతిక సంస్థలైన ఆంధ్రమహాసభ, మహారాష్ట్ర పరిషత్, కన్నడ పరిషత్, ఆర్యసమాజం నిజాం దొరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేశాయని గుర్తు చేశారు. ఆ సంస్థల్లోనే కమ్యూనిస్టులు పనిచేసి తెలంగాణ గ్రామాల్లో ఆటలు, పాటలు, పుస్తకాలు, సాహిత్యంతో ప్రారంభమై సాయుధ పోరాటం చేసే స్థాయికి వెళ్లారని అన్నారు. ఈ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనని ఉద్ఘాటించారు. కానీ ఇతరులు అధికార కాంక్ష కోసం సంబంధం లేనివాళ్లు సంబరాలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నదని చెప్పారు. సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వీరయోధులకు నిజమైన నివాళి అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్కే కార్యదర్శి కె హిమబిందు, డైరెక్టర్, మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.