Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపసభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్ : సీనియర్ నటులు కృష్ణంరాజు మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభకు రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కృష్ణంరాజు తనకు ఆత్మీయ మిత్రుడని చెప్పారు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారన్నారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు కృష్ణంరాజుకు చాలా దగ్గరయ్యానని రాజ్ నాథ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
కొన్ని నెలల కిందట ఢిల్లీలో కృష్ణంరాజును కలిశాననీ, అప్పుడు అనారోగ్యంతో ఉన్నట్టు అనిపించలేదన్నారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా.. తనను అన్నగారు అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. వివాదాలకు ఆయన ఎప్పుడు దూరంగా ఉండేవారని రాజ్‌నాథ్ చెప్పారు.
కృష్ణంరాజుతో తనకు మంచి అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిని కలవాలి అని ఇటీవలె కృష్ణంరాజు తనకు ఫోన్ చేశారని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి రాలేకపోయినందుకు కృష్ణంరాజు చాలా బాధ పడ్డారని తెలిపారు.
మర్యాదకి మారుపేరు కృష్ణంరాజు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 55 ఏండ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి సినిమాలను చేశారని పేర్కొన్నారు. కృష్ణంరాజు మంచితనమే ప్రభాస్‌కి వచ్చిందని తలసాని చెప్పారు. ఫిల్మ్ నగర్లో కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.