Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యఅతిధిగా సీఎం కేసీఆర్ :
- ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్న ఈ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. సమైక్యతా వారోత్సవాల సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారనీ, తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ విశేషాలను తెలిపే ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు, గోండు, లంబాడీ తదితర 30 రకాల కళారూపాలను ప్రదర్శిస్తారని వివరించారు. కళాకారులు, సభలో పాల్గొనే వారందరికి తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బారికేడింగ్‌లు, పారిశుధ్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, తగు రవాణా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ చౌహాన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.