Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు ఎదురొడ్డి నిలిచిన పల్లె
- రజాకార్లపై పోరాడి అసువులు బాసిన 11మంది
- నేటికీ అందని సహాయం
- ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
అప్పంపల్లి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయనిగాయమేదో మనసుకు తాకుతోంది.. ఊరిలోకి పాదం మోపగానే చేదు జ్ఞాపకాలు తట్టిలేపుతాయి. అమరుల త్యాగాలు యాదికొస్తాయి. నైజాం రజాకార్ల రాక్షస క్రీడకు సజీవ సాక్షంగా ఆనాటి రాగిచెట్టు నేటికీ నిలిచింది.. దొరల గడీలో దొంగచాటుగా ఉండి కాల్పులు జరిగిన కిటికీ ఇప్పటికీ అద్దం పడుతుంది.. రజాకార్లు నైజాం సైనికుల రాక్షస క్రీడ గురించి ఆ గ్రామస్తులు చెబుతుంటే తెలియకుండానే కండ్ల వెంట నీరు జలజలా కారుతుంది వాళ్లకి. పోలీసుల బూటు కాళ్ల చప్పుడు గురించి చెబుతుంటే ఒళ్లు జలదరిస్తుంది.. ఈ రాక్షస క్రీడలో 11 మందిని పొట్టన పెట్టుకున్న నేటి దినాన్ని ఏమని జరుపుకోవాలి. మా కుటుంబాలు నేటికీ దీనావస్థలో ఉన్నాయి. ఆనాటి దురాఘాతానికి 75 ఏండ్లు దాటినా బాధితుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి సాయమూ అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి పోరాటాలలో పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలో అక్టోబరు 7న 11 మందిని పోలీసులు రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. రజాకార్ల అరాచకాలను భరించలేక వీరు అందోళనలు నిర్వహించారు. కర్నూల్ జిల్లా కాల్వ బుగ్గ దగ్గర ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చేవారు. అక్కడ శిక్షణ పొందిన వారు అప్పంపల్లి, చింతకుంట, వడ్డెమాను తదితర గ్రామాల్లో ప్రజలను సమీకరించి ఆందోళనలు చేసేవారు. ఇది పసిగట్టిన నైజాం ముష్కరులు ఉద్యమాలను అణచడానికి అప్పంపల్లి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఎదుర్కోవడానికి కారంపొడి, దుడ్దుకర్రలతో సిద్ధం కాగా.. పోలీసులు గడీలోనుండే గాలిలోకి కాల్పులు జరిపారు. ఉద్యమకారులను 11మందిని కాల్చేశారు. చనిపోయిన వారిలో తంగెడి రారరెడ్డి, లక్ష్మారెడ్డి, బాల్రెడ్డి, చాకలి కుర్మన్న, పోతురాజు ఈశ్వరయ్య, కటికె నాన్నెమ్మ, హరిజన తిమ్మన్న, గొల్ల గజ్జలన్న, వడ్డెమాను నర్సన్న, కుర్వసాయన్న ఉన్నారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత క్రూరమైన దాడి జరిగినా గ్రామస్తులు బెదరకుండా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, నెల్లికొండి కిష్టారెడ్డిని పోలీసులకు చిక్కకుండా ఇతర ప్రాంతానికి తరలించారు.
కటిక దారిద్య్రంలో అమరుల కుటుంబాలు
రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలు ప్రస్తుతం కటిక దారిద్య్రంలో ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పోరాడిన మా కుటుంబాలను కాపాడేవారే లేరని వాపోతున్నారు. ప్రతి ఏటా సెప్టెంబరులో వచ్చి పోతుంటారు. తప్ప ఇంత పెద్ద పోరాటానికి ఊపిరి పోసిన వారి కుటుంబాలను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంగెడి రాంరెడ్డి, అతని తండి లక్ష్మారెడ్డి ఇరువురూ ఉద్యమంలో నేలకొరిగారు. రాంరెడ్డి కుటుంబానికి కొంత పొరంబోకు భూమిని ఇచ్చారు. తర్వాత వివిధ కారణాల పేరుతో తిరిగి తీసుకున్నారు. బెల్లం నాగన్నకు ఏడుగురు కుమారులు ఉన్నారు. ఒక కూతురు ఉంది. వీరు కటిక దారిద్య్రం అనభవిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరికి ఎటువంటి సహాయమూ అందలేదు. మూడో కుమారుడు బెల్లం ఆంజనేయులు తిండి గింజలు లేని దయనీయ స్థితిలో ఉన్నాడు. అతనికి పింఛను రావడం లేదు. కటికె నన్నెమ్మకు అల్లుడు ఉన్నాడు. ఇతనికి సెంటు భూమి లేదు. కూలి పనులు చేసుకొని జీవిస్తున్నాడు. హరిజన్ కిష్టన్న, వడ్డెమాన్ నర్సన్న, కుర్వ సాయన్న, పోతురాజు ఈశ్వరయ్య, చాకలి కుర్మన్న కుటుంబాల పరిస్థితీ దయనీయంగానే ఉంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
బెల్లం ఆంజనేయులు- అప్పంపల్లి- సీసీకుంట
ఉద్యమంలో ఉండి ఆర్థికంగా చితికిపోయాం. మా నాన్న జైలుపాలు అయ్యాడు. మా నాన్నను చంపాలని అనేకసార్లు ఊర్లో కాపలా పెట్టారు. గ్రామస్తులు మా నాన్నను కాపాడుకున్నారు. ఉన్న భూమి మొత్తం అమ్మి కేసుల చుట్టూ తిరిగాడు. ఇప్పుడు మాకు కనీసం తిండి గింజలు కూడా కరువయ్యాయి. నాకు 65 ఏండ్లు దాటినా పింఛను ఇవ్వడం లేదు. దయ ఉంచి నాకు రెండు గదుల ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలి.
మా అత్తమ్మను చంపినారు..
మహిమూద్ అలీ- అప్పంపూర్- సీసీకుంట
మా అత్తమ్మ ఉద్యమంలో నైజాం పోలీసుల తూటాలకు బలి అయింది. నాటి నుంచి నేటి వరకు మాకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. కనీసం నిల్వ నీడ లేదు. సాగు భూమి లేదు.
అప్పంపల్లి బాధితులను ఆదుకోవాలి
గుముడాల చక్రివర్తి గౌడ్- ఉపాధ్యాయుడు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని మరిచిపోతున్నాయి. ప్రాణ త్యాగాలు చేసిన వారి కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి. సంబురాలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అయిన వారిని, అమరుల కుటుంబాలను ఆదుకోవాలి. అప్పంపల్లిలో నైజాం రాజాకార్లకు వ్యతిరేకంగా పోరు చేసిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి.