Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యలో సిలబస్ మార్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కేంద్రం
- అందరికీ సమాన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి:
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను
- ముగిసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగో మహాసభలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యలో పాఠ్యాంశాలు మార్చి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేసేంతవరకూ ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శుభం గార్డెన్స్‌లో ఈనెల 14న ప్రారంభమైన భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర 4వ మహాసభలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో అంగబలం ఉందని విద్యను పూర్తిగా కాషాయీకరణ, ప్రయివేటీకరణ చేసే కుట్ర పన్నుతోందని వివరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరికీ విద్యను అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, ఏకంగా పేద, మధ్యతరగతి పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ యూనివర్సిటీలను తీసుకొచ్చి స్వదేశీ వర్సిటీలు స్వయం ప్రతిపత్తి కోల్పోయేలా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వందేండ్ల చరిత్రున్న యూని వర్సిటీలకు కనీసం బడ్జెట్ కేటాయించకపోవడంతో ఫెలోషిప్పులు రానిపరిస్థితి ఉందన్నారు. నూతన విద్యా విధానం 2020 ప్రవేశపెట్టడం వల్ల విద్యలో కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం లాంటి విద్వేషభావాలు చిన్ననాటి నుండే విద్యార్థుల మెదల్లో పాతుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఆ దిశగా పాఠ్యాంశాలనూ మార్చుతోందని ఆరోపించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న భగత్‌సింగ్, రాజుగురు సుఖదేవ్, నేతాజీ వంటి ఎందరో మహనీయుల జీవిత చరిత్రలను తొలగించి వారి ఆశయాలకు తూట్లు పొడుస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను, హెడ్గేవర్ సావర్కర్ చరిత్రను పాఠ్యాంశంలో తీసుకురావడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అనంతరం రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేషనల్ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్, ఎంబీబీఎస్ ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో సంక్షేమరంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం మెస్‌చార్జీలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లుఅద్దె భవనంలో కొనసాగుతు న్నాయని, ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. మొన్నటికిమొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రయివేటు యూనివర్సిటీ బిల్లును తీసుకురావడం, నూతనంగా మరో ఐదు ప్రయివేటు వర్సిటీలను అనుమతులకు బిల్లులు పాస్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలోని 7 ప్రభుత్వ యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని తెలిపారు.
మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌వర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడికొండ రవి, అనిల్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ, కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, శనిగరపు రజినీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.