Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె ఉధృతం చేయాలని జేఏసీ పిలుపు
- ఆర్ఎల్పీ ఆఫీసు వద్ద యాజమాన్యం, కార్మిక శాఖవైఖరిని నిరసిస్తూ ఆందోళన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని రీజనల్ లేబర్ కార్యాలయంలో సింగరేణి యాజమాన్యం- కాంట్రాక్ట్ కార్మికుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు ఈ నెల 22వ తేదీకి వాయిదాపడ్డాయి. ఆర్ఎల్పీ కార్యాలయంలోని డిప్యూటీ సీఎల్సీ ఛాంబర్‌లోనే జేఏసీ నేతలు గుత్తుల సత్యనారాయణ, బి మధు, ఏ వెంకన్న, ఎస్కే రాసుద్దీన్, ఎస్కే యాకూబ్ షావలి, జి.రమేష్, ఇనపనూరి నాగేశ్వరరావు, కాలం నాగభూషణం, యర్రగాని కృష్ణయ్య, డి బ్రహ్మానందం, వై.ఆంజనేయులు ఆర్.మధుసూదన్‌రెడ్డి, కె.విశ్వనాథ్, మంగీలాల్ బైటాయించారు. కార్మిక శాఖ, సింగరేణి అధికారులను నిర్బంధించారు. కార్మిక శాఖ చర్చలను పదేపదే వాయిదాలు వేయడాన్ని తప్పుబట్టారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలనీ, ఉపేక్షించేది లేదని నాయకులు హెచ్చరించారు. సమ్మె చేస్తుంటే సింగరేణి యాజమాన్యం గానీ, కార్మిక శాఖగానీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వేతనాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి హామీలను వెంటనే అమలు చేయాలని సింగరేణి వ్యాప్తంగా 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టదా? అని నిలదీశారు. ఇప్పుడిస్తున్న రూ.466 వేతనాన్ని రూ.600కి పెంచాలంటూ కార్మికులు కోరిన దాంట్లో న్యాయముందని డీవైసీఎల్సీ చెప్పినా యాజమాన్యం ఒప్పుకోకపోవడం దారుణమని విమర్శించారు. యాజమాన్యానికి లాభాలు వస్తున్నా ఎందుకివ్వరని ప్రశ్నించారు.