Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిస్థితులు అదుపుతప్పకుండా ముందుజాగ్రత్త చర్యలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సెప్టెంబర్ 17 సభల కారణంగా హైదరాబాద్ వేడేక్కటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజాం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో మిలితమైన దినం సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పక్షాలు తమదైన ఆలోచనా సిద్ధాంతాలతో బహిరంగ సభలు, జెండా వందనాలు, కవాతులు, నిర్వహిస్తున్న శనివారం విషయం తెలిసిందే. ఇందులో నిజాం నిరంకుశ పాలనుకు వ్యతిరేకంగా వీరోచితమైన సాయుధ పోరాటం నిర్వహించి చివరకు విలీనాన్ని సాధించిన కమ్యూనిస్టూ పార్టీలు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తుండగా, మరోవైపు అధికార టీఆర్ఎస్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం విమోచన దినంగా పాటిస్తూ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభను, ఉత్సవాలను నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఇంకోపక్క, ఎంఐఎం పార్టీ తిరంగా జెండా ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ అన్ని పార్టీలు తమ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవటానికి శాయశక్తులు కృషి చేస్తుండటం దీంతో పోటీ వాతావరణం ఏర్పడి పరిస్థితులు వేడెక్కాయి. ఇప్పటికే పార్టీల మధ్య వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎక్కడ కార్యకర్తల మధ్య అదుపు తప్పే పరిస్థితి ఏర్పడుతుందేమోనని శాంతి, భద్రతలనుపర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపిన ఉన్నతాధికారులు.. అవసరమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా రౌడీలు, గుండాల కదలికలపై కన్నేసి ఉంచాయి. మరోవైపు, ఇంటిలిజెన్స్ అధికారులు తమ సిబ్బందిని రంగంలోకి దింపి నిఘా వేసి ఉంచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ 17కి సంబంధించి రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో తమవైపు నుంచి ఎక్కడా కూడా శాంతి, భద్రతల నిర్వహణలో లోపాలను తలెత్తకుండా చూసుకోవాలనీ, ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని కింది స్థాయి అధికారులు, సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.