Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కడీ
- అమిత్ షాకు సీపీఐ నేత సురవరం సూటిప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు పటేల్ విమోచన కలిగించారంటూ బీజేపీ విషప్రచారం చేస్తున్నదని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విమోచన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి అమిత్ షా వస్తున్నారనీ, ఈ నేపథ్యంలో తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విముక్తి లేదా విమోచన సాధించిన పటేల్ 1947లో నిజాంతో యథాతధ ఒప్పందం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఫలితంగా ఆ తర్వాత ఏడాదికాలంలోనే రజాకార్లు, భూస్వాముల దౌర్జన్యాలు, అరాచకాలు మరింత పెరిగిపోలేదా?అని తెలిపారు. ఆ కాలంలోనే గొలుసులు తెంచుకున్న నరకలోకపు రజాకార్ జాగీలాలు చీల్చి చెండాడలేదా?అని ప్రశ్నించారు. విమోచన కలిగించాడని చెప్పే పటేల్ హైదరాబాద్‌కొచ్చి ఎందుకు నిజాంను అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు రాజప్రముఖ్‌గా పట్టాభిషేకం చేసి, ఏడాదికి రూ.కోటి రాజభరణం ఎందుకిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది నిజాంకు లొంగుబాటు కాదా? అని అడిగారు. విలీనం తర్వాత సైన్యం గ్రామాల మీద పడి, ప్రజలు పంచుకున్న పది లక్షల ఎకరాల భూములను తిరిగి భూస్వాములకు అప్పగించింది వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. రజాకార్లకంటే ఎక్కువగా పటేల్ సైన్యాలు ప్రజల మీద దాడులు, మానభంగాలు సాగించలేదా?అని నిలదీశారు. మూడు వేల మందిని చంపి, పది వేల మందిని గాయపరిచి భయోత్పాతం సృష్టించలేదా అని తెలిపారు. ఈ గడ్డ మీద నాడు ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొనకుండా ఆర్ఎస్ఎస్ ఎందుకు నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడెందుకు రంకెలు వేస్తున్నారనే విషయాన్ని అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు. భారత సైన్యంతో కమ్యూనిస్టులు యుద్ధం చేసారంటూ పటేల్ విమర్శించిన తర్వాత, వేలాది మంది కమ్యూనిస్టులను చంపి, 12 మందికి ఉరిశిక్షలు విధించి, వందలాది మందికి సుదీర్ఘ శిక్షలు వేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఓట్లు ఆయా కమ్యూనిస్టు నాయకులకే ఎందుకు వచ్చాయో చెప్పగలరా, ప్రజలు పటేల్‌ను నమ్మారా? కమ్యూ నిస్టులను నమ్మారా? అని ప్రశ్నించారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిన వారికి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పింఛన్లను నిరాకరించిన మాట వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. వీటికి అమిత్‌షా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నేడు ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో బహిరంగసభ
సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో బహిరంగసభను నిర్వహించనున్నారు. ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి కె నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ, గాయకుడు గద్దర్, ఓయూ ప్రొఫెసర్ సి కాశీం తదితరులు ప్రసంగిస్తారు.