Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని పాతబస్తీలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలికకు దుండుగులు మాయ మాటలు చెప్పి మత్తు మాత్రలు ఇచ్చి అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర రాజధాని నగరంలోనే ఇలాంటి అఘాయిత్యం జరగడం అమానుషమని పేర్కొన్నారు. అశ్లీల సాహిత్యం, మద్యం, సినిమాలు తదితర సాధనాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించటంలో నిర్లక్ష్యా న్ని వీడాలని విజ్ఞప్తి చేశారు. బాలిక కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలిపారు. అఘాయిత్యా నికి పాల్పడిన దోషులతో పాటు లాడ్జి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లఖింపూర్ఖేరి దోషులను శిక్షించాలి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేరిలో బాలికపై లైంగిక దాడి,హత్యచేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేసింది. అక్కడ మహిళలకు భద్రత కరువైందని తెలిపింది. ప్రతి రోజు ఏదో ఒక చోట ధారుణమైన ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నది.
హత్యచేసి చెట్టుకు ఉరితీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనీ, వారిని కఠినంగా శిక్షించాలని అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మరో ప్రకటనలో డిమాండ్ చేశారు.