Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షాకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి సూటి ప్రశ్న
- బీజేపీని ఓడించటం ప్రతి దేశభక్తుని కర్తవ్యం
- మిర్యాలగూడలో ఘనంగా సాయుధ రైతాంగ పోరాట వారోత్సవ ముగింపుసభ
మిర్యాలగూడ నుంచి బి.వి.యన్.పద్మరాజు
తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ అనేక కల్లబొల్లి కబుర్లు చెబుతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు అసలు ఆ పోరాట కాలంలో ఎక్కడున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. హైదరాబాద్ పరేడ్ మైదానంలో ప్రసంగించిన షా... నిజాం లొంగుబాటును హిందూ, ముస్లిం మధ్య గొడవగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అలా ఘనంగా చెప్పుకుంటున్న వారు అదే తరహాలో హిందువైన కాశ్మీర్ రాజా హరి సింగ్ గురించి, ఆయన భారత యూనియన్లో విలీనం కావటానికి నిరాకరించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించటం లేదన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం మిర్యాలగూడలో నిర్వహించిన భారీ ప్రదర్శనలో ఏచూరి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సింహారావు, మల్లు లక్ష్మి తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక ఎన్ ఎస్ టి గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డి మల్లేష్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో తొలుత ఆనాటి సాయుధ పోరాట యోధులు మేదరమెట్ల అనసూయ, కొణిజేటి సత్యవతి, గూడూరు పెద్దారపు లచ్చయ్య, భాష బోయిన గురవయ్యను ఏచూరి సన్మానించారు. అమరవీరుల జ్యోతిని వెలిగించిన ఆయన సాయుధ పోరాట యోధులను, వారి త్యాగాలను, వారి పోరాటాలను స్మరించుకున్నారు. అనంతరం ఏచూరి మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దివాళా కోరు ఆర్థిక విధానాలను నిశితంగా విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్న తీరును ప్రజలకు విడమర్చి చెప్పారు. రేషన్ షాప్ల ద్వారా పేదలకు తాము ఉచితంగా బియ్యాన్ని ఇస్తున్నామంటూ బీజేపీ చెబుతుందని తెలిపారు. అయితే అది ఎవడి సొమ్మంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలోని రాజ్యాంగ మౌలిక సూత్రాలైన సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్వావలంబన, లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అనే అంశాలపై మోడీ సర్కార్ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడమనేది లౌకికపార్టీల బాధ్యత కావాలంటూ సూచించారు. తద్వారా జాతీయస్థాయి లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. అయితే ఆ ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరనేది ఎన్నికల తర్వాతే తేలుతుం దన్నారు. దీనికి ఉదాహరణగా 2004 లోక్సభ ఎన్నికల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తీరును వివరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కేరళలో సీపీఐ(ఎం), బీజేపీకి ఏ టీమ్ అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు. ముందు గోవాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ ఆ పార్టీకి హితవుపలికారు. ఆనాడు దేశ స్వాతంత్య్రం, స్వావలంబన కోసం మన పెద్దలు పోరాటం చేశారు. అదే తరహాలో ఈనాడు రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత నడుంబిగించాలని ఏచూరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.