Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటిలయత్నాలు తిప్పికొట్టాలి
- తెలంగాణ చరిత్రను మలినం చేస్తున్న దుష్టశక్తులు
- సెప్టెంబర్17తో వారికి సంబంధం లేదు
- తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి
- తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో సీఎం కేసీఆర్
దేశంలో మతతత్వ శక్తులు పెట్రేగిపోతున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని చీల్చే కుటిల ప్రయత్నాలకు పాల్పడుతున్న మతతత్వ శక్తుల వికృత క్రీడలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం జీవికనే కబళిస్తుందనీ, మానవ సంబంధాలను మంటగలుపుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని దయ్యబట్టారు. స్వాతంత్య్ర భారత దేశంలో తెలంగాణ విలీనం, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ ఆషాడభూతులు...చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ...అప్రమత్తంగా ముందడుగు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదమరిస్తే ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో చెప్పేందుకు 58 ఏండ్ల తెలంగాణ ప్రజల దుర్బర జీవితమే ఒక ఉదాహరణ అన్నారు. పొరపాటున కూడా అటువంటి కష్టం, వేదన మళ్లీ రాకుండా ఉండాలంటే, తెలంగాణ సమాజానికి నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలని ఆకాంక్షించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందనీ, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని చెప్పారు. ఇందుకోసం యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా చేసిన మహోజ్వల కృషి మనందరికీ తెలిసిందేనన్నారు. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, చేసిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములేనని చెప్పారు. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయిందని తెలిపారు.
మదిలోనే ఆనాటి అద్భుత ఘట్టాలు
ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయనీ, తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగపరుస్తూనే ఉంటాయని సీఎం చెప్పారు. 'నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆదివాసీ యోధుడు కోమురంభీమ్, భూస్వాముల ఆగడాలకు బలైపోయిన దొడ్డి కొమురయ్య, మహా నాయకుడు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, వీర వనిత చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన భార్య ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కష్ణమాచార్య, సుద్దాల హనుమంతు సాహసాన్ని తలచుకున్నారు. వారందరి ఉజ్వల స్మృతికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను' అని చెప్పారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్ వల్లభభారు పటేల్ ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల భారతదేశం ఏకీకృతమైందని కేసీఆర్ అన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించినట్టు సీఎం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చిందనీ, 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు. నేడు తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నదని వివరించారు. 'తెలంగాణ ప్రభుత్వం అవలంభించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ రూ.5,05,849 కోట్లు కాగా, 2021-22 నాటికి రూ.11, 54,860 కోట్లకు పెరిగింది. 2014 -15 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104లు కాగా, 2021-22 నాటికి రూ.2, 78,833కు పెరిగింది. జాతీయ సగటు కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణం' అని పేర్కొన్నారు.
సంపద పెంచాలి...పేదలకు పంచాలి
సంపదను పెంచాలి...పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని సీఎం అన్నారు. అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా రూ.50 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నదన్నారు. పేద, బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగిందని చెప్పారు. పంటల దిగుబడి విఫరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందని వివరించారు.
గురుకుల ఆదివాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం అన్నారు. వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. తెలంగాణకు హరితహారం ద్వారా గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతానికి పెరిగిందని చెప్పారు. సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారంలేని విధంగా రూపొందించిన టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేండ్లలో రూ.2, 32, 111 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయనీ, 16 లక్షల 50 వేల ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు.ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 శాతం మాత్రమే ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతంగా ఉందని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైందని వివరించారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం తన బుద్ధి కుశలతను మరోమారు చూపించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని కోరారు. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలే తప్ప అశాంతి అలజడులకు అవకాశం లేదనీ, అప్రతిహతంగా అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకు పోవాలని ఆకాంక్షించారు. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని కేసీఆర్ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరారు.