Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక రక్తస్రావంతో బాలింత మృతి
- వైద్యాధికారులే కారణమంటూ బంధువుల బైటాయింపు
- భారీగా మోహరించిన పోలీసులు
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో అధిక రక్తస్రావంతో బాలింత మృతిచెందడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శనివారం బాధితులు, గ్రామస్థులు, ప్రజాసంఘాల నేతలు ఆస్పత్రి ఎదుట మృతదేహాన్ని పెట్టి బైటాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆస్పత్రి వద్ద భారీగా మోహరించారు. వివరాల్లోకి వెళితే..
కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన సిరుసు అఖిల(21) పురిటి నొప్పులతో వారం రోజుల కిందట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు గురువారం ప్రసవం చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో చికిత్స చేసినా ఫలితం లేక వైద్యాధికారులు ఆమె గర్భసంచిని తొలగించారు. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులకు సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకుపోతుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు మృతదేహాన్ని తీసుకొచ్చి ఆస్పత్రి ముందు పెట్టి ధర్నా చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి బాధితులతో మాట్లాడారు.
బాలింత మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
ఐద్వా, ప్రజా సంఘాల నేతల డిమాండ్
బాలింత మృతికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట ధర్నాలో ఐద్వా, తెలంగాణ విద్యావంతుల వేదిక, కేవీపీఎస్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిరస్సు అఖిల(21)కు 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచి పురిటి నొప్పులు ప్రారంభం అయితే.. డ్యూటీ డాక్టర్లు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంలో నాలుగు కేజీల బిడ్డ ఉండటం వల్ల సాధారణ ప్రసవం సాధ్యం కాదని తెలిసి కూడా ఉదరంపై బలవంతంగా నొక్కి డెలివరీ చేశారని చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా తల్లికి అధిక రక్తస్రావం అవుతున్నా డాక్టర్లు పట్టించుకోకుండా.. అక్కడున్న నర్సులకు అప్పగించి వెళ్లారని ఆరోపించారు. గర్భంపై ఎక్కువ ఒత్తిడి చేయడంతోనే గర్భసంచి పగిలిపోయిందని, అందుకే ఎక్కువ రక్తస్రావం అయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు. కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. గైనకాలజీ వార్డులో కొంతకాలంగా సిబ్బంది, వైద్యులు తీరు పట్ల రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ గైనకాలజీ వార్డుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పుట్టిన బాబుకు ప్రభుత్వమే పూర్తిగా భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్‌మాదిగ, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, చెరువు అన్నారం సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శించిన ఎమ్మెల్యే కంచర్ల
అఖిల మృతదేహాన్ని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సందర్శించి, కుటుంబాన్ని ఓదార్చారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
విచారణలో తేలితే చర్యలు తీసుకుంటాం
సూపరింటెడెంట్ లచ్చూనాయక్
అధిక రక్తస్రావం అయ్యి, శరీరంలో రక్తం లేకపోవడం వల్లనే ఆమె చనిపోయింది. ఒకవేళ ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం ఉన్నట్టు విచారణతో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.