Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వక్రభాష్యాలకు తప్పదు మూల్యం
- విలీనానికి కారణం సాయుధ పోరాటమే
- ప్రజల జీవనాన్ని దుర్భరం చేసిన మోడీ విధానాలు
- తెలంగాణ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాటి నిజాం పాలనలో జరిగిన దోపిడీ, వెట్టి చాకిరి, నిరంకుశ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటాలు జరిగితే..సంఫ్‌ుపరివార్ శక్తులు ఉత్సవాలు జరపటమేంటని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల సభను ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ చరిత్రకు బీజేపీ వక్రభాష్యాలు చెబుతూ ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వీర సావర్కార్ అండమాన్ జైల్లోనుంచి బ్రిటీషువారిని క్షమాపణ వేడుకున్న చరిత్ర ఎవరికి తెలియదని ప్రశ్నించారు. కుక్కలకు బొక్కలేసినట్టుగా సావర్కార్కు బ్రిటీషు వారు పెన్షన్ ఆశచూపి లొంగదీసుకున్నారని చెప్పారు. నైజాంను చూసి కలుగుల్లో దాక్కున్న ఈ శక్తులు ఉత్సవాలు జరపటం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింరాజు నుంచి విమోచన జరిగిందన్న వాదనకు అర్థం లేదని చెప్పారు.మోడీ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. దీన్నుంచి దృష్టి మళ్లించేందుకే పనికిరాని చర్చ చేస్తున్నారని విమర్శించారు.సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో దేశంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఓ చారిత్రక ఘట్టమన్నారు.రజకార్లు, దొరలు, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలు, మారణహోమం నుంచి బాధలు పడ్డ ప్రజానికం నుంచి పోరాటం ప్రారంభమైందని చెప్పారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాట చరిత్రను వక్రీకరించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పోరాట వారసత్వం కలిగిన వారు ఇక్కడుంటే..కాకులు అమిత్‌షా మీటింగులో ఉన్నాయన్నారు. మొన్నటి వరకు జాతీయ జెండానే గౌరవించని వీరు దేశభక్తులమనీ, పోరాట వీరులమని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలతో జావగారిని నిజాంను యూనియన్ సైన్యాలు లొంగదీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారన్నారన్నారు. బీజేపీ ఎంఐఎం మధ్యలో చీకటి ఒప్పందాలున్నాయని చెప్పారు. మోడీకి నిజమైన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఒక్క బీజేపీ నాయకుడి పేరు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కమిటి సభ్యులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాష, టీజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ కాశీం,పశ్యపద్మ, తెలంగాణ పోరాట యోధుడు మోహినుద్దీన్‌తో పాటు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నర్సింహ్మా, కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు.