Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో ఉత్తర్వులు
- మోడీ...ఆమోదిస్తావో... ఉరితాళ్లు చేసుకుంటావో నీ ఇష్టం...
- త్వరలో పోడు భూములకు పట్టాలు
- భూమిలేని వారికి 'గిరిజన బంధు'
- మతపిచ్చితో జనం ఆగం కావద్దు :తెలంగాణ ఆదివాసీ-బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెస్తామనీ, దీనిపై వారం రోజుల్లో ఉత్తర్వులు ఇస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు కోరుతూ ఏడేండ్ల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదని ఆయన ఆక్షేపించారు. ఇక ఉపేక్షించబోమనీ, కేంద్రంతో సంబంధం లేకుండా తామే రాష్ట్రంలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ఈ ఉత్తర్వులను ప్రధాని నరేంద్రమోడీ గౌరవించి ఆమోదిస్తారో...లేక ఆ జీవో కాపీలనే ఉరితాళ్లు చేసుకుంటారో...అయన ఇష్టమని హెచ్చరించారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''ప్రధాని, హౌంమంత్రికి చేతులెత్తి మొక్కుతున్నా...ఇప్పటికైనా రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనల్ని రాష్ట్రపతికి పంపండి. రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డే ఉన్నారు. ఆమె తప్పకుండా దాన్ని ఆమోదిస్తారు. ఆ వెంటనే మేం రాష్ట్రంలో అమలు చేసుకుంటాం'' అని చెప్పారు. పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇచ్చి, వారికీ రైతుబంధు ఇస్తామన్నారు. భూమి లేని గిరిజనులకు దళితబంధు తరహాలోనే 'గిరిజన బంధు' అమలు చేసి, రూ.10 లక్షలు ఇస్తామని స్పష్టంచేశారు. శనివారంనాడిక్కడి ఎన్టీఆర్ స్టేడియంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'తెలంగాణ ఆదివాసీ-బంజారాల ఆత్మీయ సభ' జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతకుముందు ఆయన బంజారాహిల్స్‌లో ఆదివాసీ-గిరిజన భవనాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నెక్లెస్‌రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు వందలాదిమంది కళాకారులు ఆటా, పాట, సంస్కృతి, సంప్రదాయాలు ప్రదర్శించారు. అక్కడ జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాటాడారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్లు వేదికలు కావాలని ఆయన ఆకాంక్షించారు. కవులు, కళాకారులు, రచయితలు, మేథావులు వారి సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దక్పథంతో ఇక్కడే మేథోమధనం జరపాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 6శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందారనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జనాభా ప్రాతిపదికన వారి రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తుచేశారు. ఎనిమిదేండ్లలో కేంద్రం ఒక్క మంచి పని అయినా చేసిందా అని ప్రశ్నించారు. ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు) ల పేరుతో పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు దోచిపెడుతున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.''58 ఏండ్ల క్రితం జరిగిన ఓ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నాం. అనేక కష్టనష్టాలకు ఓర్చి స్వరాష్ట్రం సాధించుకున్నాం. మత పిచ్చితో తెలంగాణ మరో కల్లోలానికి గురికావొద్దని కోరుతున్నా'' అని అన్నా రు. మతపిచ్చి ఒక్కసారి తలకెక్కితే ఎందుకూ పనికిరాకుండా పోతామనీ, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో రాష్ట్రాన్నీ, దేశాన్ని అభివృధ్ధి చేసుకోవాలని చెప్పారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని ఎక్కడా లేదనీ, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. ఆ సౌకర్యంతెలంగాణకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దానికోసం సభ చప్పట్ట్లు కొడుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరారు. కేంద్రం విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. గిరిజన పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. గిరిజన గురుకులాలలను మరిన్ని పెంచుతామన్నారు. ఈ ఏడాదే గిరిజన బాలురు, బాలికలకు గురుకులాలు తెచ్చే యోచన చేస్తున్నామని చెప్పారు. దేశంలో అణచివేతకు గురైన జాతుల కోసం తన జీవితాన్నే దారపోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అనీ, ఆయన్ని సమున్నతంగా గౌరవించే విధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనా భవనమైన సచివాలయా నికి ఆ పేరే పెట్టుకున్నామని తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు వత్తిళ్లు పెరుగుతున్నాయనీ, శనివారం మహారాష్ట్ర నాయకులు కొందరు తాము కూడా మద్దతు ఇస్తామని తన దగ్గరకు వచ్చి చెప్పారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు చూసి పొరుగు రాష్ట్రాలు ప్రభావితమవుతు న్నాయన్నారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు హాజరయ్యారు. సభ ప్రారంభంలో సీఎం కేసీఆర్ సంత్ సేవాలాల్, కుమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభానంతరం అదే వేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కనకరాజు,రాంచంద్రయ్యలను సన్మానించారు.కొమురం భీం మను మడు సోనేరావు,ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మాలావత్ పూర్ణ, అంతర్జా తీయ హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి మదాలి కరీనాతో పాటు దేశంలోని పలు ప్రతి ష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న గిరిజన, ఆదివాసీ విద్యార్థులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.