Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
- చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ
- ఓట్ల కోసం మత ఘర్షణలకు యత్నం
- మోడీని గద్దె దించి మత సామరస్యాన్ని కాపాడాలి : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- జనగామలో ఘనంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవం
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దెదించి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, దోపిడీ లేని సమాజాన్ని సృష్టించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపులో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ ఇనిస్టిట్యూట్ మైదానంలో సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా వీర తెలంగాణ అమరవీరులకు ఏచూరి ఘనంగా నివాళులర్పించారు. 1948 జనవరి 30న గాంధీ హత్య జరిగిందని, ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి 1949 సెప్టెంబర్ వరకు ఆర్ఎస్ఎస్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నేతలందరినీ జైళ్లల్లో పెట్టారన్నారు. 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' పోలీసు యాక్షన్ ప్రారంభించడంతో 17వ తేదీన నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేస్తూ ప్రకటించారన్నారు. ఈ సందర్భంలో జైళ్లల్లో వున్న ఆర్ఎస్ఎస్ నేతలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏం పాత్ర వుందని ప్రశ్నించారు. సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధమూ లేకున్నా బీజేపీ నేతలు హడావుడి చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోడీని గద్దె దింపి రాజ్యాంగాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతోనే భూ సంస్కరణలు వచ్చాయన్నారు. నాడు నిజాం నియంతృత్వానికి, దేశ్‌ముఖ్‌లు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదలు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఎదురొడ్డి పోరాడారని చెప్పారు. ఈ పోరాటంలో 4 వేల మందికిపైగా తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. 3 వేల గ్రామాల్లో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసి నిజాం నియంతృ త్వాన్ని ఎదురించారని.. పర్యవ సానంగా 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగిందన్నారు. వీర తెలంగాణ పోరాట యోధుల స్ఫూర్తితో మన మంతా ఐక్యంగా పోరాడి దోపిడీ లేని సమాజాన్ని సృష్టించుకుందామని పిలుపు నిచ్చారు. అదే ఆ పోరాట యోధులకు మనమిచ్చే ఘననివాళి అన్నారు.
విప్లవాన్ని అణచడానికే పోలీసు యాక్షన్
నిజాం లొంగిపోయినా భారత ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో'ను 1951 వరకు మూడేండ్ల పాటు కొనసాగించి కమ్యూనిస్టు లను అణచివేసిందని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు లను అణచివేయక పోతే విప్లవం వస్తుందని నాటి భారత ప్రభుత్వం భావించిం దన్నారు. ఆ రోజుల్లో పెట్టుబడి దారులు, భూస్వాములు భారత సైన్యాన్ని ఉపయోగించుకొని కమ్యూనిస్టులపై దాడులు చేశారన్నారు.
చరిత్ర వక్రీకరణ
దేశ చరిత్రను ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఏచూరి విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ నేతలు.. నేడు ఆ పోరాటాన్ని హిందు, ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినమంటూ పెద్దఎత్తున ప్రచారం చేస్తూ తెలంగాణలో ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. బీజేపీ నేతల అబద్ధాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీఐ(ఎం) శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాశ్మీర్లో రాజా హరిసింగ్ కూడా నిజాం లాగే తన సంస్థానాన్ని భారత్‌లో కలపనన్నాడని గుర్తు చేశారు. పాకిస్థాన్ సైన్యాన్ని దించడంతో.. భయపడిన హరిసింగ్ భారత్‌ను అభ్యర్థించగా.. సంస్థానాన్ని మా దేశంలో కలిపితేనే సైన్యాన్ని పంపుతామని షరతు విధించడంతో సమ్మతించారన్నారు. అలాంటి రాజా హరిసింగ్ జన్మదినాన్ని కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిందన్నారు. అదే నిజాం తన సంస్థానాన్ని దేశంలో విలీనం చేస్తే.. హిందూ, ముస్లిం మధ్య పోరాటంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దీనికి హరిసింగ్ హిందువు కావడం, నిజాం ముస్లిం కావడమే కారణమన్నారు.
హిందూ రాష్ట్రంగా మార్చే యత్నం
ప్రజలను మత ఘర్షణల్లో దింపి ఓట్లు రాబట్టుకోవాలని బీజేపీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులపై దాడులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. మోడీ విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మూడేండ్లలో 25 శాతం నిరుద్యోగం పెరిగిందన్నారు. ధరలు పతాకస్థాయిలో పెరుగుతూ వున్నాయ న్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు ప్రజలే యజమానులని, అలాంటి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండానే ప్రధాని మోడీ సంస్థలను అమ్మేస్తున్నారని విమర్శించారు. మోడీని గద్దెదింపితేనే ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోగలుగుతామన్నారు.
సాయుధ పోరాట వీరులకు సన్మానం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, విస్నూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి కుమారుడు బాబుదొరను హతమార్చిన దేవరుప్పులకు చెందిన దర్జానాయక్ను, తాటికొండకు చెందిన అక్కినపల్లి తిరుపతయ్య దంపతులను సీతారాం ఏచూరి శాలువాలు కప్పి సన్మానించారు.
సాయుధ పోరాటంలో వాటి పాత్ర ఏంటీ..? : అబ్బాస్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర ఏమిటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17తో వాటికి సంబంధం లేదన్నారు. తెలంగాణ విమోచన దినమంటూ ప్రచారం చేసుకుంటూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్‌షా కర్నాటక, మహారాష్ట్ర మంత్రులను ఇక్కడకు పిలుపించుకొని కార్యక్రమాలు చేయడమేంటని ప్రశ్నించారు. వాళ్ల ప్రభుత్వాలతో ఆ రాష్ట్రాల్లోనే కార్యక్రమాలు చేయించండన్నారు.
భారీ ప్రదర్శన
జనగామ పట్టణ వీధుల్లో రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన రహదారి గుండా ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ మైదానం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరులకు విప్లవ జోహార్లు తెలుపుతూ నినాదాలు చేస్తూ రెడ్ షర్ట్ వాలంటీర్లు కదంతొక్కారు. మహిళలు కోలాటమాడుతూ డప్పు వాయిద్యాల నడుమ ప్రదర్శన సాగింది. ఈ బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, నాయకులు గంగసాని రఘుపాల్, ఐద్వా రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, ట్రాన్స్పోర్ట్ రంగం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి కళావతి, రాళ్లబండి శశిధర్, జనగామ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్రాజం, సింగారపు రమేష్, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, యాదగిరి, బొట్ల శేఖర్ తదితరులు
పాల్గొన్నారు.