Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : మంత్రి కేటీఆర్
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు
- జాతీయ జెండాల ఆవిష్కరణ, బహిరంగ సభలు
నవతెలంగాణ- విలేకరులు
స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు రాష్ట్రంలో మంటలు రగిలించేందుకు యత్నిస్తున్నాయి.. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదు.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 1947 సెప్టెంబర్ 17న భారత్‌లో హైదరాబాద్ విలీనమైందన్నారు. రాజాకార్ల అరాచకాలపై పోరాడిన కొమురం భీం, దొడ్డి కొమరయ్య లాంటి ఎందరో మహానుభావుల సాహసాలు మరువలేనివన్నారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి.. ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. వేదిక మీదకు రాలేకపోయిన సమరయోధుల చెంతకు మంత్రి వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. జగిత్యాల కలెక్టరేట్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎనిమిదేండ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు.
వనపర్తి జిల్లా కేంద్రం ఐడీఓసీ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ రావుతో కలిసి ఆయన పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉన్నదని, రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.
75 ఏండ్లు స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతం అస్తిత్వం కోసం ఆరాటపడిందని ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల కళా ప్రదర్శనలు అందర్నీ అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య వీర మరణం అనంతరం తెలంగాణ ప్రాంతంలో జాగీర్దారులు, జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వీరోచిత పోరాటం సాగిందని గుర్తు చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. నల్లగొండలో జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమకారులు, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ అని, ఒక కులానికో మతానికో సంబంధించినది కాదని చెప్పారు.