Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో బీజేపీ పాత్ర ఎక్కడ
- సబ్బండ వర్గాల నాయకత్వం వహించారా
- దేశ స్వతంత్ర పోరాటంలోనూ బీజేపీ లేదు : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ఆరుట్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి.. నైజాం సర్కారును లొంగదీసుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో బీజేపీ పాత్ర ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. సబండ వర్గాలకు నాయకత్వం వహించారా.. లొంగిపోయిన నిజాం రాజును ఎందుకు జైలుకు పంపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ స్వతంత్ర పోరాటంలోనూ బీజేపీ పాత్ర శూన్యం అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ హైజాక్ చేస్తోందన్నారు. వాస్తవ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాషాయ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో కుల, మత తారతమ్యం లేకుండా భూస్వామ్య విధానాలకు, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సాగిన పోరాటమని గుర్తు చేశారు. ఆ పోరాటానికి ఎర్రజెండా నాయకత్వం వహించిందని చెప్పారు. సుమారు రెండు సంవత్సరాలపాటు సాగిన పోరులో తెలంగాణలోని సంస్థానాలన్నీ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లాయని, చివరి దశలో హైదరాబాద్ సంస్థానం కూడా కమ్యూనిస్టుల చేతుల్లోకి పోతే పుట్టగతులు ఉండవన్న భయంతోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం సర్కారును లొంగదీసుకుందని చెప్పారు. సైనిక చర్య జరిగిన తర్వాత కూడా నైజాం నవాబును జైలు పంపకపోగా ఆయనకు రాచ మర్యాదలు చేశారని చెప్పారు. నిజాం నవాబు లొంగిపోయిన తర్వాత కూడా నెహ్రూ సైన్యాలు తెలంగాణ ప్రాంతంలోనే మూడు సంవత్సరాలపాటు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ పోరాట వారసత్వాలను కనుమరుగు చేస్తూ కాషాయ కూటమి కుయుక్తులు పన్నుతున్నదాని చెప్పారు. దొడ్డి కొమరయ్య బలిదానంతో సాయుధ పోరు మరింత తీవ్రమైందని గుర్తు చేశారు. పది లక్షల ఎకరాల భూములను పంపిణీ చేస్తే, తదనంతర కాలంలో నెహ్రూ సైన్యాలు దగ్గరుండి మళ్లీ భూస్వాములకు ఆ భూములను కట్టబెట్టాయన్నారు. భూ సమస్య పరిష్కారం కాకుండా సామాజిక న్యాయం, రాజ్యాధికారం సాధ్యం కాదన్నారు. అక్రమంగా కాజేసిన భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు పంపిణీ చేసేందుకు సీపీఐ(ఎం) నాయకత్వంలో ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ళ భాస్కర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్, యాదయ్య, జగదీష్, రాజు, మండల కార్యదర్శి శ్యాంసుందర్, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, జంగయ్య, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ జంగయ్య, జగన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు.