Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇలాగైతే కష్టమే అంటూ గుస్సా
- సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశం
- ఎలాగైనా మునుగోడులో గెలవాల్సిందే
- ఎప్పుడైనా 'ముందస్తు' రావొచ్చు.. క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే
- బీజేపీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కీలక నేతల మధ్య సమన్వయలేమి పార్టీ కొంపముంచే ప్రమాదం హెచ్చరిస్తూనే..ఇలాగైతే అధికారంలోకి రావడం కష్టమే అంటూ గుస్సా అయినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం హైదరాబాద్‌లోని హోటల్ హరితప్లాజాలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశం జరిగింది. అందులో కేవలం 20 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నేతల సమన్వయం, మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎత్తుగడలు, పార్లమెంట్ ప్రవాస్ యోజన కమిటీల తీరుపై దాదాపు రెండు గంటల పాటు అమిత్‌షా సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, సంస్థాగత ఇన్చార్జి సునిల్ బన్సాల్, ఎంపీలు లక్ష్మణ్, అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ప్రేమేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నికను అంత తేలికగా తీసుకోవద్దనీ, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో గతం నుంచి ఉన్న నేతలకు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెంట పార్టీలోకి వచ్చిన నేతలకు మధ్య ఉన్న గ్యాప్‌ను వీలైనంత త్వరగా పూడ్చాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రతి గ్రామంలోని పాత, కొత్త నాయకులకు సమప్రాధాన్యం ఇస్తూ ఒక జిల్లా స్థాయి నేతతో పాటు స్థానికుల్లో పాత, కొత్త నాయకులకు సమప్రాధాన్యం కల్పించాలని సూచించారని ఓ నేత చెప్పారు. బూతుల వారీగా క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టిసారించాలనీ, మరింత కష్టపడాలని చెప్పారని తెలిపారు. మునుగోడుపై చర్చ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డితో అమిత్‌షా ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. అంతకుముందు రాష్ట్ర నేతలకు క్లాసు పీకినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలాగైతే కష్టమంటూ ఒకింత అసహనం కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్ ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందనీ, ఈ పరిస్థితుల్లో కీలక నేతలు తమ తీరును మార్చుకోవాల్సిందేననీ, మనస్పర్ధలను, విభేదాలను విడనాడి ఐక్యం ముందుకు సాగాలని నొక్కిచెప్పారని ప్రచారం జరుగుతున్నది. హడావిడి చేస్తే సరిపోదనీ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆదేశించారు. నెలలో కనీసం 20 రోజులైనా తమకు కేటాయించిన ప్రదేశాల్లో పనిచేయాలని సూచించినట్టు తెలిసింది. క్లాస్ పీకారనే విషయంపై ఓ కీలకనేత వద్ద ఆరా తీయగా..'ఆయన పెద్దాయన. పార్టీ బలోపేతంపై సూచనలు, సలహాలివ్వడం సహజం. దాన్ని ఆగ్రహం, సీరియస్ అనలేం' అంటూ దాటవేశారు. హరితప్లాజాలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెంల గోపీచంద్ అమిత్‌షాను కలిశారు. క్రీడారంగ అభివృద్ధిపై మాట్లాడామనీ, రాజకీయ అంశాలపై చర్చలు జరగలేదని గోపీచంద్ స్పష్టం చేశారు. కోర్‌కమిటీ సమావేశం అనంతరం మోడీ జన్మదినం సందర్భంగా వికలాంగులకు ఉపకరణాలు, ట్రైసైకిళ్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత శామీర్‌పేటలో ఈటల రాజేందర్ ఇంటికి అమిత్‌షా వెళ్లారు. అక్కడ రాజేందర్ తండ్రి మల్లయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌తో కాసేపు మాట్లాడారు.
అమిత్‌షా కాన్వాయి ముందు కారు..అద్దాలు ధ్వంసం చేసిన భద్రతా సిబ్బంది
అమిత్‌షా హోటల్ హరితప్లాజాకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే సమయంలో ఆయన కాన్వాయికు ముందు నిలిచిన కారు అద్దాలను ఎస్పీజీ సిబ్బంది ధ్వంసం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐదు నిమిషాల పాటు అమిత్‌షా కాన్వాయి ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే, గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ శనివారం ఉదయం తన కారులో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌కు వచ్చారు. ఆయన ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో దీంతో కారు నెమ్మదించింది. అక్కడ రోడ్డుఎత్తుగా ఉండటంతో పైకి సడన్‌గా ఎక్కలేకపోయింది. అంతలోనే అమిత్‌షా కాన్వాయి వస్తుంది అంటూ పోలీసుల హడావిడితో శ్రీనివాస్ కంగారుపడిపోయారు. అదే సమయంలో కారు ఇంజిన్ ఆగిపోయింది. పోలీసులు వెనక నుంచి నెట్టేందుకు యత్నిస్తున్న సమయంలోనే అమిత్‌షా భద్రతా సిబ్బంది వచ్చి శ్రీనివాస్‌ను దుర్భాషలాడుతూ కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కారు యజమాని శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తాను టీఆర్ఎస్ కార్యకర్తనే కావచ్చుగానీ కాన్వాయిని ఆపాలనే ఉద్దేశం మాత్రం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. భద్రతా సిబ్బందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భద్రతా వైఫల్యం : లక్ష్మణ్
'కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనలోనే భద్రతా వైఫల్యం ఉంటే ఇతరులు ఎలా రక్షిస్తారు? వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. గతంలో అస్సాం సీఎం పర్యటన సందర్భంలోనూ ఇలాగే జరిగింది. ఇది మంచిపద్ధతి కాదు' అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.