Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ సమస్యను ఎజెండా చేసిందే కమ్యూనిస్టులు
- సాయుధ పోరు స్ఫూర్తితో ఏడు మౌలిక లక్ష్యాల కోసం పోరాటాలు: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సాయుధ రైతాంగ పోరాటంలో తన పాత్రేలేని బీజేపీ.. ఇప్పుడు ఆ పోరాట గొప్పతనాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే దురుద్దేశంతో మత కక్షలు లేపి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ కాషాయ రాజకీయం తెలంగాణ గడ్డపై చెల్లదని, చెల్లనీయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని ప్రసంగించారు.
భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు తప్ప కాంగ్రెస్, బీజేపీ జాడ యాడుందని ప్రశ్నించారు. విమోచన పేరిట హైదరాబాద్‌లో వేడుకలు జరుపుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాగానీ, కాషాయ కార్యకర్తలకుగానీ తెలంగాణ సాయుధ పోరాటంతో ఏమైనా సంబంధముందా అని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంలో మత ఎజెండాతో అధికారంలోకి వచ్చినట్లే దక్షిణంలోనూ అలాంటి విధ్వంసకర విధానాలను ముందుకు తెచ్చేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రమాదకర విధానాలను సైద్ధాంతికంగా తిప్పిగొట్టడం, ఓడించడం కోసమే మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామన్నారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజా పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.
తెలంగాణలో రజాకార్లు, జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచి భూములపై హక్కుల కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడం కోసం పోరాడాలని ఆంధ్ర మహాసభ (సంఘం) పిలుపునిచ్చిందన్నారు. చిట్యాల ఐలమ్మ నాలుగు ఎకరాల్ని కౌలుకు సాగుచేస్తే పంట ఆమెకు దక్కకుండా చేసేందుకు ఇసునూరి రాంచంద్రారెడ్డి తన గుండాల చేత దాడి చేయించాడని గుర్తు చేశారు. ఆ సమయంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సంఘం తరపున పోరాడి పంటను కాపాడి ఆమె ఇంటికి చేర్చిన తర్వాత కడవెండిలో ఊరేగింపు చేశారన్నారు. సంఘం పోరాడి గెలవడాన్ని జీర్ణించుకోలేని ఇసునూరు దొర గుండాలను ఉసికొల్పి కాల్పులు జరిపించిన సంఘటనలో దొడ్డి కొమరయ్య అమరుడయ్యారని చెప్పారు. అలా ఊరూరా ఉద్యమం ఉప్పెనలా సాగి నిజాంను పారిపోయేలా సాగిందన్నారు. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టుల ప్రాధాన్యత పెరిగితే ప్రమాదమనుకున్న అప్పటి కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం నిజాంతో ఒప్పందం చేసుకుని సైన్యాన్ని పంపి లొంగిపోయినట్టు చేశారన్నారు. ఇప్పటికీ తెలంగాణలో భూముల సమస్య ఉన్నందున దున్నే వాడికి భూమి దక్కాలనే నినాదంతో సీపీఐ(ఎం) పోరాడుతుందన్నారు.
ప్రత్యామ్నాయ విధానాల ద్వారానే సమసమాజం ఏర్పడుతుందన్నారు. అందరికీ ఉచిత విద్య, అందరికీ వైద్యం, దున్నే వారికి భూమి, అందరికీ ఉద్యోగం, ఉద్యోగులందరికీ వేతనాల పెంపు, స్వయం ఉపాధి, సామాజిక న్యాయం అనే ఏడు మౌలిక లక్ష్యాలను కమ్యూనిస్టు ప్రభుత్వాలు మాత్రమే అమలు చేయగలవని కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు రుజువు చేశాయన్నారు. సాయుధ పోరాట వారసత్వం కల్గిన సీపీఐ(ఎం) నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. మతోన్మాద కుటిల రాజకీయాలను తిప్పికొట్టేందుకు సకల శక్తుల్ని ఏకం చేసి పోరాడేందుకు ముందుకు సాగుతుందని చెప్పారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. నిజాం పాలనలో ఉన్న తెలంగాణలో చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల గ్రంథాలయ ఉద్యమం నడిచిందన్నారు. అలా చదువుకున్న వాళ్లంతా సామాజిక ఆంశాలపై ప్రజల్ని చైతన్యపరిచి పోరాటం వైపు మళ్లించారన్నారు. ఆ తెగువతోనే ఐలమ్మ, దొడ్డి కొమరయ్య.. దొరలకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారన్నారు. ఈ సభకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీరం మల్లేశం అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కార్యదర్శివర్గ సభ్యులు రాజయ్య, అతిమేల మాణిక్యం, రామచందర్, నర్సింహ్మరెడ్డి, సాయిలు, సీనియర్ నాయకులు వాజీద్‌అలీ, జిల్లా కమిటీ సభ్యులు నర్సింహులు, యాదవరెడ్డి, ఆర్.శ్రీనివాస్, మహిపాల్, ప్రవీణ్‌కుమార్; చిరంజీవి, విద్యాసాగర్, లక్ష్మీ, రేవంత్‌కుమార్, పాండురంగారెడ్డి, అశోక్, బాగారెడ్డి, రాజిరెడ్డి, నాగేశ్వర్రావు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.