Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే... కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు
- ఐక్య ఉద్యమాలతో తిప్పికొడదాం
- హెచ్ఆర్ జీఐఇఏ మహాసభలో పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంతో పెట్టుబడీదారులకు ఎదురైన కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కార్మికులు, ఉద్యోగులపై బీజేపీ ప్రభుత్వం విరుచుకుపడుతున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. అందుకోసమే వేతనాల్లో కోతలు, 44 కార్మిక చట్టాల రద్దు, నాలుగు కోడ్లు తేవడం జరిగిందని చెప్పారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (హెచ్ఆర్ జీఐఇఏ) హైదరాబాద్ రీజియన్ అధ్యక్షులు ఎ.నారాయణరావు అధ్యక్షతన 25వ మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులు వత్తాసు పలికే వారనీ, ప్రస్తుతం వారే రాజకీయ నాయకులుగా మారి చట్టసభల్లోకి ప్రవేశించారని తెలిపారు. దీంతో కార్మికులు, ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. నాలుగు కోడ్లను అమలు చేసేది లేదని కేరళ వామపక్ష ప్రభుత్వం కార్మికులకు అండగా నిలిచిందనీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మిన్నకుండిపోయాయని తెలిపారు. కేసీఆర్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తున్నదనీ, బీజేపీకి వ్యతిరేకంగా ఇటీవల మాట్లాడుతున్నారని చెప్పారు. వీరోచితమైన పోరాటాలతోనే యాజమాన్య అనుకూల ప్రభుత్వాల విధానాలపై పైచేయి సాధించగలమనీ, అలాంటి పోరాటాలకు సీఐటీయూ అండగా నిలబడుతుందని చెప్పారు.
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఇఏ) మాజీ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ మాట్లాడుతూ నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘపోరాటం తర్వాత వేతన సవరణ సాధించుకోగలిగామని పోరాట క్రమాన్ని వివరించారు. ఆ అసోసియేషన్ స్టాండింగ్ కమిటీ కార్యదర్శి సంజరు ఝా మాట్లాడుతూ మోడీ పాలనలో ఆదానీ క్రమం తప్పకుండా ఎదిగారనీ, మరి ఉద్యోగులకు ఎదుగుదల ఏదని? ప్రశ్నించారు. జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ (జీఐఇఏ) సౌత్ జోన్ ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్ మాట్లాడుతూ ధరల పెరుగుదలతో పీఎఫ్ వడ్డీ రేటు తగ్గుతుందనీ, అదే సమయంలో కట్టాల్సిన రుణాలకు వడ్డీ రేట్లు పెంచుతున్నారని చెప్పారు. పెన్షనర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు సంజీవ్ నారాయణ మాట్లాడుతూ ఉద్యోగులకు శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో స్పష్టంగా తెలియాలని సూచించారు. రాజకీయ స్పష్టత వస్తే సమస్యలు పరిష్కారమవుతాయనీ, ఓటు వేసేటప్పుడు ఉద్యోగులకు అనుకూలమైన రాజకీయ విధానాలున్న వారిని ఎంచుకోవాలని కోరారు. కార్యక్రమానికి కంటే ముందు అసోసియేషన్ జెండాను ఎగురవేసిన నాయకులు అమరులకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఐఐఇఏ ఉపాధ్యక్షులు కె.వి.వి.ఎస్.ఎన్.రాజు, జీఐఇఏ సౌత్ జోన్ ఉపాధ్యక్షురాలు ఎస్.ఎస్.శైలజ, సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేష్, హెచ్ఆర్ జీఐఇఏ వై.సుబ్బారావు, ఇన్సూరెన్స్ నాయకులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.