Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలంటూ తీర్మానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించాలని ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్ణయించింది. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ లోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య ఫెడరేషన్ జిల్లా మహాసభల నివేదికను సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో ఫెడరేషన్ జిల్లా మహాసభలు పూర్తయ్యాయనీ, మిగతా నాలుగు జిల్లాల మహాసభలు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి జిల్లా కమిటీలకు దిశానిర్దేశం చేయడం కోసం ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లో ఫెడరేషన్ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు, ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొనాలని కోరారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా వందలాది మంది జర్నలిస్టులతో ర్యాలీ నిర్వహించాలని, మహాసభల కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. అదేవిధంగా మహాసభలకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలను, ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులను ఆహ్వానించాలని రాష్ట్ర కమిటీ తీర్మానించింది. మహాసభలను విజయవంతం చేయడానికి కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లతో విస్తత ప్రచారం నిర్వహించాలనీ, ఇందుకు జిల్లా కమిటీలు పూర్తి స్థాయిలో సహకరించేలా రాష్ట్ర కమిటీ బాధ్యత తీసుకోవాలని సమావేశం సూచించింది. అదేవిధంగా జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్య, సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, ఎల్గొయి ప్రభాకర్, కార్యదర్శులు నర్సింగ్ రావు, సలీమా తదితరులు పాల్గొన్నారు.