Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవంపై తాత్సారం
- గుండ్రాంపల్లి మరో జలియన్‌వాలాబాగ్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజాకార్ల ఆగడాలు, నిజాం ఆకృత్యాలకు అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్వల్లాభారు పటేల్ చేపట్టిన ఆపరేషన్పోలోతో ముగింపు లభించిందనీ, నిజాం సంస్థానం భారత్‌లో కలిసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. కొన్నిపార్టీలకు, కొందరికి భయపడి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పాలకులు తాత్సారం చేశారని విమర్శించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరిట శనివారం సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్‌లో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లాభారు పటేల్ విగ్రహానికి అమిత్‌షా నివాళులు అర్పించారు. జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర భద్రతాదళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర కళాకారులు ప్రదర్శించిన కళారూపాలను తిలకించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం కొమ్రంభీమ్, రాంజీగోండు, స్వామిరామానందతీర్ధ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మర్రిచెన్నారెడ్డి, రంగారెడ్డి, మల్లప్ప, నాగప్ప, తదితరులు పోరాడారని స్మరించుకున్నారు. రజాకార్ల అన్యాయాలు, అత్యాచారాలు, ఆకృత్యాలపై యుద్ధం ప్రకటించి సర్దార్వల్లాభారుపటేల్ కేంద్ర బలగాలతో ఉక్కుపాదం మోపారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు విమోచనం కలిగిందన్నారు. విమోచన దినాన్ని ప్రధాని మోడీ అధికారికంగా నిర్వహించేందుకు గొప్ప అవకాశం కల్పించారన్నారు.కేంద్రం నిర్ణయంతో ఇతర పార్టీలు కూడా వేడుకలు నిర్వహించేందుకు అనివార్యంగా ముందుకు వచ్చాయన్నారు. గుండ్రాంపల్లి ఘటన మరో జలియన్‌వాలాబాగ్ తలపించిందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంశాఖ మంత్రి వల్లాభారుపటేల్ జాతీయపతాకాన్ని ఎగురవేశారనీ, 75 ఏండ్ల తర్వాత ఇప్పుడు అమిత్‌షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించిందని తెలిపారు. 25 ఏండ్ల నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారి కంగా నిర్వహించాలని పోరాటాలు చేస్తే ఇప్పుడు ఫలించిందన్నారు. ఎవరు ఏపేరుతో వేడుకులు చేస్తున్నా అన్నింటినీ స్వాగతిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాధ్ షిండే, కర్నాటక రవాణా శాఖ మంత్రి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
షా మీటింగ్ ప్లాప్‌షో
తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. అమిత్‌షా మీటింగ్ ప్లాప్షోగా మారిందనే చర్చ జోరుగా నడుస్తున్నది. వేడుకల నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. జనసమీకరణలో పూర్తి వైఫల్యం కనిపించింది. వచ్చినవారికీ సీటింగ్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఆరోగేటు వద్ద వేసిన టెంటు కింద మీడియా ప్రతినిధులకు సీట్లను కేటాయించారు. అయితే, అందులో ఎల్ఈడీ స్కీన్లు ఉత్సవాల మధ్యలోనే ఆగిపోయాయి. షార్ట్‌సర్క్యూట్ జరగటంతో అప్రమత్తమయిన అధికారులు ఆ టెంటు కింద ఉన్న రెండు ఎల్ఈడీ స్కీన్ల కరెంట్ వైర్లను కట్ చేసేశారు. పైర్మెన్స్ ఆ స్థలాన్ని పరిశీలించారు. అమిత్‌షా తర్వాత స్వీచ్‌లను వీక్షించడటం, వినటం ఇబ్బందిగా మారింది.అమిత్‌షా, కిషన్‌రెడ్డి, ఏక్‌నాథ్‌షిండే ప్రసంగాలు చప్పగా సాగడంతో బీజేపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలువురు యోధులను పలుకరించగా..'తాము ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్, కమ్యూని స్టు పార్టీలకు చెందినవారమే. ఇన్నేండ్లు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నోళ్లం. చనిపోయినా ఆ జెండాలనే మీద కప్పుకోవాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అని చెబితే వచ్చాం' అని చెప్పారు.