Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భూమి కోసం, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నాడు సాగించిన ప్రజా పోరు, సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాలను, ఆనాటి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పించాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం బస్‌భవన్‌లో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన, దారుణ మారణకాండ, రజాకార్ల ఆకత్యాలు, వాటిని ఎదుర్కొవడానికి జరిగిన ప్రజాపోరు, సాయుధ పోరాటం, ఆనాటి తెలంగాణ సమాజం అనుభవించిన కష్టాలను వివరించారు. నిజాం తూటాలకు బలైన మొదటి వీరుడు దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచిపోయారని కీర్తించారు. ఈ పోరాట పటిమలో తెలంగాణ ప్రజలతో పాటు కళ్యాణ్ కర్ణాటక, మరాఠ్వాడ ప్రాంతాల ప్రజలు ఆదర్శంగా నిలిచారన్నారు. రాచరిక వ్యవస్థను ప్రశ్నిస్తూ నాటి కవుల బాషోద్యమంతో మొదలైన సామూహిక ప్రజా పోరు, సాయుధ పోరాటం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడేంత వరకు ఛైతన్యవంతంగా సాగటం ఆదర్శవంతమన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.