Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ విసుర్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలో ఉన్నది సహకార సమాఖ్య ప్రభుత్వం కాదనీ, బలవంతపు సమాఖ్యే అని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వ్యాపారం, వాణిజ్యం, సంక్షేమం తదితర రంగాల్లో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలనీ, కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దక్షిణ్ డైలాగ్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడ 'భారత్ నిజమైన సమాఖ్య దేశమేనా' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ప్రధాన మంత్రి టీమ్ ఇండియా గురించి ఎప్పుడూ మాట్లాడుతారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసింది? ఎన్నిసార్లు అన్ని రాష్ట్రాలు కూర్చొని చర్చించుకున్నాయి? ఆరోగ్య రంగంలో తమిళనాడు బాగా పనిచేస్తోంది. దాని గురించి ఇతర రాష్ట్రాలు కూడా తెలుసుకోవాలి కదా! దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి పనులు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఎందుకు నేర్చుకోకూడదు? అందరినీ కలిపి కేంద్రం సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం ఇన్నేండ్లల్లో ఒక్కటి కూడా లేదు' అని చెప్పారు. కేంద్రం చెప్పే సహకార సమాఖ్య వినడానికి మాత్రమే బాగుంటుందనీ, కానీ వారి చర్యలు 'బలవంతపు సమాఖ్య' అనే భావనే కలుగుతున్నదని విమర్శించారు. 'సబ్కా సాథ్ సబ్కా వికాస్' ఎక్కడుందని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులు శశిథరూర్ మాట్లాడుతూ కేంద్రం ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో తరహాలో చూస్తున్నదనీ, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. నిధుల కేటాయింపులో ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పల్వనీల్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.