Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శనివారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు ఈసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 166 ఇంజినీరింగ్ కాలేజీల్లో 11,260 సీట్లు, 118 పార్మసీ కాలేజీల్లో 1,174 సీట్లు కలిపి మొత్తం 12,434 సీట్లున్నాయని తెలిపారు. ఇంజినీరింగ్లో 9,968 (88.52 శాతం) మందికి, ఫార్మసీలో 50 (4.25 శాతం) మందికి కలిపి 10,018 (80.57 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా ఇంజినీరింగ్లో 1,292 (11.48 శాతం) సీట్లు, ఫార్మసీలో 1,124 (95.75 శాతం) సీట్లు కలిపి 2,416 (19.43 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. సరైనన్ని వెబ్ఆప్షన్లు నమోదు చేయకపోవడం వల్ల 3,411 మందికి సీట్లు కేటాయించలేదని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 581 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈనెల 22 నాటికి ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని సూచించారు. లేదంటే సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత అభ్యర్థులు ఈనెల 30 నుంచి వచ్చేనెల పదో తేదీ వరకు కేటాయించిన కాలేజీల్లో ధ్రువపత్రాల నకలుతోపాటు ఒరిజినల్ టీసీని సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు https://tsecet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.