Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీ షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు కోసం ఈనెల 19 నుంచి విచారణ జరపాలని తెలంగాణ అడ్మిషన్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. ఈ మేరకు టీఏఎఫ్ఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామారావు శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాలకు ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను గతంలోనే విచారణ జరిపి ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిని ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. అయినప్పటికీ ఇంజినీరింగ్ ప్రవేశాల తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ తీరుపై సుమారు 81 ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆ కాలేజీలు, టీఏఎఫ్ఆర్సీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫీజులను వసూలు చేసుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫీజులపై స్పష్టత రాకుండానే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో తొలివిడత సీట్లను సైతం కేటాయించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు టీఏఎఫ్ఆర్సీ మళ్లీ కాలేజీ యాజమాన్యాలతో విచారణ చేపట్టాలని నిర్ణయించడం గమనార్హం.
సిబ్బంది సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి : టీఏస్టీసీఈఏ
ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీస జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. వారికి ప్రతినెలా యూజీసీ, ఏఐసీటీఈ, విశ్వవిద్యాలయాల మార్గదర్శకాల ప్రకారం జీతాలు చెల్లించేలా టీఏఎఫ్ఆర్సీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల జీతాలపై సమగ్ర విచారణ చేయాలని పేర్కొన్నారు. టీఏఎఫ్ఆర్సీకి సమర్పించిన ఫార్మ్-16, ఫార్మ్-26లను పూర్తిగా పరిశీలనా చేయాలని సూచించారు. ఉద్యోగులతో ముఖాముఖి అయితే వాస్తవాలు బయటికి వస్తాయని తెలిపారు.