Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకలిపోరులో 30వేలమంది కాంట్రాక్టు కార్మికులు
- సింగరేణి కార్మిక జేఏసీ మద్దతు
- వేతనాలు పెంచాల్సిందే.. ఈ నెల 22న మళ్ళీ చర్చలు
నవ తెలంగాణ -సింగరేణి ప్రతినిధి
సింగరేణి సంస్థ సాధించే లాభాలు, సృష్టిస్తున్న సంపదకు కాంట్రాక్టు కార్మికుల చెమట చుక్కలు, రక్తపు మరకలు అద్దుతున్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్న జీతాలనైనా సింగరేణి సంస్థలో అమలుపరచాలని పోరాడుతున్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల స్ఫూర్తితో సింగరేణిలోనూ కాంట్రాక్టు కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కదనరంగంలో దూసుకుపోతున్నారు. సమ్మె సంపూర్ణంగా కొనసాగుతున్నది. కార్మిక వర్గం శాంతియుత నిరసనలు, ప్రజాస్వామిక ఆందోళనలు చేపట్టింది. కార్మికుల డిమాండ్లపై కొన్ని నెలలుగా పోరాడుతూనే ఉన్నారు. కోర్కెల పరిష్కారంలో ఎలాంటి ముందడుగూ పడకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో జారీ చేసిన సమ్మె నోటీసుపై పది ధపాలుగా చర్చలు జరిగాయి. కార్మిక శాఖ అధికారులు, సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 9 నుంచి సింగరేణి వ్యాప్తంగా సమ్మెబాట పట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, టీఎస్టీయూసీ జేఏసీగా ఏర్పడి పోరాడుతున్నాయి సివిల్, సివిక్, అన్వేషణ విభాగం, బ్లాస్టింగ్, బొగ్గు రవాణా, హాస్పిటల్, కన్వేయన్స్ డ్రైవర్, సెక్యూరిటీ తదితర 40 విభాగాల్లో సమ్మె కొనసాగుతున్నది. సింగరేణిలో పనిచేస్తున్న అన్ స్కిల్డ్ కార్మికుడి నుంచి వోల్వో డ్రైవర్ వరకు ప్రతినెలా రూ.8వేల నుంచి రూ.19వేల వరకు నష్టపోతున్నారు. ఇదిగాక బోనస్, ఓవర్ టైం, టీఏ, డీఏ రూపేణా కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు.
కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లు..
కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, రాష్ట్ర జీవోఎంఎస్ నెంబర్ 22 ప్రకారం జీత భత్యాలు గని కార్మికులకు చెల్లిస్తున్న విధంగా ఒకటవ కేటగిరి జీతాల్లో ఏదైనా ఒకటి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. లినర్సరీ, సులబ్, ఓబీ హెల్పర్, వే బ్రిడ్జి లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులకు కనీస వేతనాలు, బోనస్ అమలుపరచాలని, సీఎం పీిఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ లేదా సింగరేణి వైద్యశాలల్లో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించాలని పోరాడుతున్నారు.
ఫెయిర్ వేజెస్ చెల్లించాలి - బి.మధు, జేఏసీ నేత
కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయకపోవడం వారి అసమర్థతను తెలియజేస్తుంది. ఇతర పరిశ్రమల్లో అమలు చేస్తున్న విధంగా ఫెయిర్ వేజెస్ చెల్లించడం ద్వారా వేతన పెరుగుదలలో అన్యాయాన్ని కొంతమేర తగ్గించవచ్చు. కార్మిక శాఖ అధికారులు చొరవ తీసుకుని న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యాన్ని ఒప్పించాలి.
కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలదే బాధ్యత
- వేల్పుల కుమారస్వామి, జెఏసి కన్వీనర్,రామగుండం రీజియన్
సమ్మెలో ఉన్న 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఆకలి తీర్చాల్సిన బాధ్యత కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల పైనే ఉంది. శాంతియుతంగా పోరాడుతున్న కార్మికులను బెదిరింపులకు గురి చేయవద్దు. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తాం. ప్రయివేటు ఓబీ పనులను అడ్డుకుంటాం. పారిశుధ్య విభాగాన్ని సంపూర్ణంగా సమ్మెలోకి దింపుతాం. సింగరేణి కార్మికుల మద్దతు తీసుకుంటాం.