Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో పలుచోట్ల దాడులు
- డిగ్రీ విద్యార్థితో సహా నలుగురు కస్టడిలోకి?
- ఉగ్రవాద సంబంధాలపై ఆరా
- అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంకుపాస్ బుక్కులు జప్తు
- పలువురికి నోటీసులు అందజేత
- ఏపీలోనూ దాడులు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ జగిత్యాల/ఆదిలాబాద్‌టౌన్
రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పలు జిల్లాల్లో దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో 26 చోట్ల సోదాలు నిర్వహించారు. అనుమానితుల ఇండ్లలో పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో పీఎఫ్ఐ పేరుతో ఉగ్రవాద శిక్షణ జరుగుతున్నట్టు సమాచారం. ఉగ్రవాద సంబంధాలు, ఆర్థిక నిధుల సమీకరణ, బ్యాంకు లావాదేవీలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్కులను ఎన్ఐఏ బృందాలు జప్తు చేశాయి. నలుగురిని అదుపులోకి తీసుకోగా.. పలువురికి నోటీసులు జారీ చేసింది. అయితే సోదాలపై ఎన్ఐఏ బృందాలు నోరు విప్పలేదు. ఎంతమందిని ప్రశ్నించారు? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారన్న అంశంపై స్పష్టతలేదు. అయితే ఎన్ఐఏ బృందాల దర్యాప్తులో ఉగ్రవాద సంబంధాలు తేలనున్నాయి.నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.
నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణంలో స్థానిక పోలీసుల సహకారంతో మొత్తం 26 బృందాలు ఏకకాలంగా ఈ సోదాలు చేపట్టాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు లింకులు ఉన్న అనుమానితుల ఇండ్లలో ముఖ్యంగా జల్లెడపట్టాయి. పట్టణంలో ఆటోనగర్ చెందిన అబ్దుల్ ఖాదర్‌ను ఏప్రిల్ నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పీఎఫ్ఐకు అనుకూలంగా 400 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 28 మందిపై నిజామాబాద్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో నలుగురిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు.
ఈ కేసుపై ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జిల్లా దర్యాప్తు చేపట్టింది. ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారానికి చెందిన కంప్యూటర్ సర్వీస్ ప్రొవైడర్ నిర్వహకుడు ముఖీమ్‌ను గంటల తరబడి ప్రశ్నించారు. 'ఏమైనా ఉంటే(ఉగ్రవాద సంబంధాలు) ఇప్పుడే చెప్పు' అని అడిగినట్టు తెలిసింది. ముఖీమ్ నుంచి రెండు ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని కార్యాలయానికి రావాలని ఆదేశించినట్టు తెలిసింది. పట్టణంలో ఆటోనగర్‌కు చెందిన డిగ్రీ సెకండియర్ విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. చంద్రశేఖర కాలనీకి చెందిన యువకుడికి సైతం నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఆర్మూర్ పట్టణంలో జిరాయత్ నగర్‌కు చెందిన ఇద్దరిని ప్రశ్నించింది. బోధన్‌లో పట్టణంలోనూ ఈ బృందాలు అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహించాయి. కాగా, ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆదిలాబాద్‌లో తల దాచుకుంటున్నట్టు తెలుసుకున్న పక్కా సమాచారంతో ఎన్ఐఏ, పోలీస్ అధికారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శాంతినగర్ కాలనీలోని అబూబకర్ మజీద్ సమీపంలో సోదాలు చేశారు. కొంత కాలంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్న ఫిరోజ్ అనే వ్యక్తిని అధికారులు తెల్లవారుజామున పట్టుకున్నారు. అతని నుంచి ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌కు చెందిన పాపులర్ ఫ్రంట్ నాయకుల ఇండ్లల్లో తనిఖీలు చేశారు. టవర్ సర్కిల్లోని కేర్ మెడికల్ షాపు తాళాలు పగులకొడుతుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దాంతో అధికారులు యజమానిని పిలిపించి తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. వాటి సాయంతో మరికొందరి ఇండ్లలో సోదాలు జరిపారు. అనుమానితుల నుంచి అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాలుగు చోట్ల, కరీంనగర్లో ఒక చోట ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటు ఏపీలోని కర్నూల్, నెల్లూరు లలోనూ దాడులు జరిగాయి. ఎన్ఐఏ దాడుల్లో ఒక ప్రాంతం నుంచి రూ. 8,31,500 లతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనపర్చుకున్నారు. అబ్దుల్ ఖాదర్‌తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, అబ్దుల్ ఖాదర్ మరో 26 మందిని కూడదీసుకొని పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ కేసుల తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.