Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై పోలీసుల నివేదిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసు శాఖ ప్రాథమిక నివేదికను సమర్పించింది. నివేదికలో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, 8 మంది మృతి చెందడంతోపాటు మరో 11 మందికి తీవ్రగాయాలు కావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోనే రాజాసింగ్ బగ్గా అనే వ్యాపారవేత్త రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో లాడ్జ్‌ను నిర్వహిస్తున్నాడు. అదే భవనం సెల్లార్లో 'జీమొపారు' పేరుతో ఎలక్ట్రికల్ వెహికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ షోరూంను నిర్వహిస్తున్నారు. కాగా, ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి ఛార్జింగ్ పెట్టగా, బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయ్యాక అందులో నుంచి పొగ వెలువడిందని, బ్యాటరీలోని లిథియం అయాన్ రసాయనం వల్ల పొగలు వచ్చాయని, ఈ క్రమంలో మంటలు పక్క వాహనాలకు వ్యాపించాయని నివేదికలో వెల్లడించారు. సెల్లార్ నుంచి లాడ్జిలోని నాలుగో అంతస్తు వరకు పొగ వ్యాపించిందని, పొగ పీల్చుకొని లాడ్జిలో ఉన్నవాళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని చెప్పారు. మంటలు మాత్రం కేవలం సెల్లార్కే పరిమితమైనట్టు క్లూస్ టీం తేల్చింది. మంటల వల్ల ఎవరూ చనిపోలేదని, దట్టమైన పొగను ఎక్కువగా పీల్చుకోవడం వల్లే 8 మంది చనిపోయినట్టు పోలీసులు నివేదికలో తెలిపారు.