Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17,305 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం
- కోతల్లేని కరెంట్ తెలంగాణలోనే సాధ్యం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
'కరెంటు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గనిర్దేశిగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలోని పవర్ హాలీడేలు, కరెంటు కష్టాలు ఇప్పుడు లేవు. కోతల్లేని నిరంతర కరెంటు సరఫరాలో దేశానికే మనం ఆదర్శంగా నిలుస్తున్నాం' అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. మండు వేసవిలో కూడా అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నట్టు తెలిపింది. విద్యుత్తు రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని వివరించారు. '2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కషి ఫలితంగా ఇప్పుడది 17,305 మెగావాట్లకు పెరిగింది. సోలార్ విద్యుదుత్పత్తిలో ఎనిమిదేండ్లలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించినట్టు పేర్కొన్నారు. తలసరి వినియోగం పెరుగుదల రాష్ట్ర సమగ్ర పురోగతిని ప్రతిబింబించే సూచిక అని చెప్పారు. సోలార్ పవర్ కెపాసిటీ వచ్చే ఏడాది నాటికి 8 వేల మెగావాట్లు దాటనున్నట్టు తెలిపారు. విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో స్వల్పకాలంలోనే రాష్ట్రం అద్భుతాలను ఆవిష్కరించి, దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నదని వివరించారు. ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తెలిపారు.