Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-దుండిగల్
నైజాం నిరంకుశ పాలనలో ప్రజలు దోపిడికి గురయ్యారని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్‌లోని సుందరయ్య భవన్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను సీపీఐ(ఎం) బాచుపల్లి మండల కార్యదర్శి బి వెంకట రామయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. ఆ రోజుల్లో తెలంగాణ కమ్యూనిస్టుల వశమైతే భవిష్యత్తులో ఢిల్లీ కోటను ముట్టడిస్తారన్న భయం నెహ్రూ కాంగ్రెస్ వర్గాల్లో దడ పుట్టించిందని వ్యాఖ్యానించారు. నిజాం రాజు పరమ నిరంకుసుడని, ఆయన పాలనలో ఉన్న భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దారులు.. ప్రజలు ప్రత్యక్షంగా విపరీతమైన దోపిడీకి పీడనకు గురయ్యారని తెలిపారు. అత్యంత క్రూరులు మతోన్మాదులుగా పేరుబడ్డ రజాకార్ మూకలన్నింటికీ ఈ దొరల గడీలలోనే విడిది అని చెప్పారు. రజాకార్ల సైన్యాధ్యక్షులు కాసీం రజ్వీ అయితే, ఉపాధ్యక్షులు విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి హిందువని, వారి దాష్టికానికి బలైన బందగీ ముస్లిం అని గుర్తించాలన్నారు. లక్షల ఎకరాలకు అధిపతిగా జనాల మూల్గులు పీల్చిన చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, పసిబిడ్డల తల్లుల్ని మోదుగు డొప్పల్లో పాలు పిండించి పరీక్షించిన పసునూరి రామ్మోహన్రావు, నిర్మాల నియంత లింగాల నరసింహారెడ్డి, కోడూరి కర్కోటకుడు గడ్డం నరసింహారెడ్డి హిందువులే కదా అన్నారు. వీరి అమానుషాలను ఎండగట్టిన షోయబుల్లా ఖాన్, వీరి దురాగతాలను ప్రతిఘటించిన మక్దూం మొహియుద్దిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. వీటిలో పీడకులు, పీడితులు అన్న విభజనకు తప్ప హిందువులు, ముస్లింలు అనే విభజనకు ఆస్కారం ఎక్కడా లేదన్నారు. అందువల్ల దీన్ని ముస్లిం రాజు నుంచి హిందూ ప్రజలకు లభించిన విమోచనగా చిత్రించడం కేవలం ఒక బీజేపీ కుట్ర అని నొక్కివక్కాణించారు.
సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి. సత్యం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనలో వీరోచితమైన పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని సామాన్య ప్రజానీకానికి పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. దేశంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగకుండా, అణచివేయాలని కపట ఆలోచనతో సాగించిన దమనకాండలో సుమారు 4000 మంది అమరులయ్యారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం చంద్రశేఖర్, ఎన్ బాలాపీరు, విప్లవ్, కె. కృష్ణ నాయక్, ఎం శంకర్, కార్పొరేటర్ ఆర్ శ్రీరాములు, జేవీవీ జిల్లా నాయకులు మల్లయ్య చారి, జ్యోతి, బాబు, శివ, సంతోష్, మాధవ్, ఐద్వా నాయకులు, మాజీ సర్పంచ్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.