Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ రాష్ట్రస్థాయి చర్చలో చెరుపల్లి
- సీఎం దృష్టికి తీసుకెళతా : ఆర్ కృష్ణయ్య
- అవకతవకలను నియంత్రించే మార్గం 'నగదు బదిలీ'
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని తెలంగాణ గొర్రెల,మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్రాస్థాయి చర్చా వేదికలో వక్తలు కోరారు. పథకంలో కొనసాగుతున్న అవకతవకలను నియంత్రించేందుకు సరైన మార్గమే నగదు బదిలీ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ అధ్యక్షతన 'గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ చేయాలి' అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ ప్రవేశ పెట్టాలంటూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రతిపాదించారు. సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కాసాని ఐలయ్య దాని ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో నగదులు బదిలీ ద్వారా చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్రమాలను నియంత్రించే అవకాశం ఉందన్నారు. 75 శాతం సబ్సిడీతో రెండో విడత గొర్రెల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా ఉండాలంటే నగదు బదిలీ పథకం ఒక్కటే ప్రత్యామ్నాయం పేర్కొన్నారు. ఆ పథకం పూర్తి ఫలాలు గొల్ల, కురుమలకు అందాలంటే మధ్య దళారుల జోక్యాన్ని తగ్గించాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన గొర్రెల పంపిణీలో అంతులేని అవినీతి జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందనీ, అవినీతికి అలవాటు పడిన కొంతమంది పశుసంవర్థక శాఖ అధికారులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నగదు బదిలీ డిమాండ్ న్యాయమైందని చెప్పారు. దీన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాననీ, అమలుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్, ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్, జాతీయ బీసీ విభాగం అధ్యక్షులు డి. కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గొర్రె పిల్లలు, ముసలి గొర్లను పంపిణీ చేశారని తెలిపారు. దీని కారణంగా గొల్ల, కురుమలు నష్టపోయారని చెప్పారు. కొంతమంది నాయకులు, ఆంధ్రా ప్రాంతానికి చెందిన దళారీలు, డాక్టర్లు లాభపడ్డారని చెప్పారు. కొన్నిచోట్ల గొర్రెలు కొనకుండానే కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపారని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో 519 యూనిట్లు కొనకుండానే కొనుగోలు చేసినట్టు లబ్దిదారుల వద్ద సంతకాలు సేకరించారని గుర్తు చేశారు. ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండాలంటే నగదు బదిలే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కురుమ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కె శ్రీనివాస్, న్యాయవాదులు చలకాని వెంకట్ యాదవ్, బిక్షపతి యాదవ్, విప్లవ కుమార్, గొరిగే మల్లేష్ కురుమ, జక్కుల వంశీకృష్ణ కురుమ, కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నేత లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాదం బాలరాజు యాదవ్, టీవైఎస్ఎస్ నాయకులు బి మల్లేష్ యాదవ్, గంగుల మధు యాదవ్, మేకల లలిత యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ దొడ్డి కొమురయ్య పుస్తక రచయిత మురిపాల శ్రీనివాస్, జీఎంపీఎస్ రాష్ట్ర నాయకులు కాడబోయిన లింగయ్య, అవిశెట్టి శంకరయ్య, టి లింగయ్య, అమీర్పేట మల్లేష్, బల్లెం అశోక్, కాల్వ సురేష్, పరికి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.