Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కా భవనం పూర్తయ్యేదెప్పుడో?
నర్సింగ్ కౌన్సిల్ వ్యవస్థ గోల్‌మాల్‌గా మారింది. నర్సింగ్ విద్య, వృత్తి, ఇతర సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించాల్సిన అది నామమాత్రంగా మిగిలింది. నర్సింగ్ విద్య పూర్తి చేసుకుని సర్టిఫికేట్ల కోసం వచ్చే విద్యార్థినుల కష్టాలు వర్ణాతీతం. కౌన్సిల్ రిజిస్ట్రార్‌గా ఉన్న విద్యావతి దేన్నీ సరిగ్గా పట్టించుకోకపోగా...డీఎంఈ అండదండలతో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. చివరకు ఏడాదికోసారి నిర్వహించాల్సిన ఆడిట్ సైతం అటకెక్కిందని తెలిసింది.
- నర్సుల డబ్బు బ్యాంకులో ఫ్రీజ్...ఆడిట్ అంతంతే
- సిబ్బంది కొరత..సర్టిఫికేట్ల కోసం వెళ్తే తిప్పలే
- కనీస మౌలిక వసతుల లేమితో విద్యార్థునుల ఇక్కట్లు
- నర్సింగ్ స్కూళ్లు, కళాశాలలపై పర్యవేక్షణ కరువు
- నర్సింగ్ కౌన్సిల్ ప్రక్షాళన జరిగేనా...?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ 2015లో ఏర్పడింది. మన రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు కేరళ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, ఛత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారు నర్సింగ్ విద్యనభ్యసిస్తున్నారు. చదువు పూర్తయి ఫలితాలొచ్చాక ఆ సర్టిఫికేట్‌తో కౌన్సిల్లో రిజిస్టర్డ్ నర్స్, రిజిస్టర్డ్ మిడ్ వైఫ్‌గా నమోదు చేసుకోవాలి. అక్కడకెళ్తే కూర్చునేందుకు చోటు ఏమోగానీ కనీసం వాష్ రూం సౌకర్యం కూడా లేదు. నమోదు కోసం కనీసం ఎనిమిది పని చేయాలి కాని అందులో సగం మందే ఉన్నారు. దీంతో రోజుల తరబడి కౌన్సిల్ తిరగాల్సిన వస్తున్నది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థునులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే, ఆందోళనలు చేస్తే ఒకట్రెండ్రోజులు టెంటు, కుర్చీలు వేసి ఆ తర్వాత మళ్లీ మరిచిపోతున్నారు. నర్సింగ్ కాలేజీలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా సిబ్బంది లేమి, ఎథిక్స్ కమిటీ నిర్వీర్యంతో తనిఖీలు అటకెక్కాయి. నర్సింగ్ స్కూల్స్, కాలేజీల్లో వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య, నిబంధనలు తదితరాలపై పర్యవేక్షణ కరువైంది. ప్రయివేటు యాజమాన్యాలు రిజిస్ట్రార్ కు పెద్ద మొత్తంలో ముట్టజెప్పుతున్నారనే విమర్శలున్నాయి.
2009 నుంచి మొదలైన ఐదేండ్ల ప్రణాళికలో అప్పటి యూపీఏ ప్రభుత్వం నర్సింగ్ కౌన్సిల్‌కు కోటి రూపాయలు, డీడీ (నర్సింగ్) కు మరో కోటి రూపాయలు మంజూరు చేసింది.వాటిని వెంటనే వినియోగించుకోవాలని సూచించింది. దీంతో అప్పటి ఉన్నతాధికారులు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆమోదం కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. బాగ్ లింగంపల్లిలో అప్పటి మార్కెట్ ధర కన్నా తక్కువగా ప్రకారం గజానికి రూ.32 వేల చొప్పున పిక్స్ చేసి 405 గజాలను పర్చేజ్ కమిటీ ద్వారా కొన్నారు. అక్కడ భవన నిర్మాణానికి రూ.91 లక్షల అంచనా వేశారని సమాచారం. ఏపీఎంఐడీసీకి రూ.50 లక్షలు రిలీజ్ చేసి కేంద్రానికి తిరిగి డబ్బు వెళ్లకుండా ఆపగలిగారు. ప్లాన్ అప్రూవ్, బ్లూ ప్రింట్, జీహెచ్ఎంసీకి దరఖాస్తు చకచకా జరిగిపోయాయి. కాంట్రాక్టర్ 90 శాతం పనులనూ పూర్తి చేశారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఏపీఎంఐడీసీ కౌన్సిల్‌ను డబ్బు అడిగింది. అదే విషయాన్ని కౌన్సిల్ అప్పటి ప్రభుత్వానికి విన్నవించింది. అయితే రాష్ట్ర విభజనలో సమయంలో అన్ని శాఖల మాదిరిగానే దీనికీ నిధులను ఆపేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లవుతున్నా ఒక్కడుగూ ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన తర్వాత నర్సింగ్ కౌన్సిల్లో రెండు రాష్ట్రాల మధ్య అన్ని కేటాయింపులు ఇప్పటికీ సెటిలవ్వలేదు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో కట్టిన భవనం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌కే చెందుతుంది. కనుక వెంటనే ఆ భవనాన్ని ఉపయోగంలోకి తేవాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ భవన నిర్మాం కోసం కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న ఫైల్ కనిపించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది.
ఫ్రీజ్ తొలగించలేరా?
రాష్ట్ర విభజన తర్వాత నర్సింగ్ కౌన్సిల్‌కు కూడా రెండుగా విభజించారు.. అయితే అప్పటికే కౌన్సిల్ వద్ద ఉన్న డబ్బును ప్రీజ్ చేసినట్టు సమాచారం. ఇదంతా కూడా నర్సింగ్ విద్యార్థులు చెల్లించిన సొమ్ము. ఫ్రీజ్ చేయడంతో దానికి కనీసం వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనిని తొలగించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. దీంతో పేద నర్సింగ్ విద్యార్థుల కోసం పని చేయాల్సిన సంస్థ నిధులు వ ృధా పడి ఉన్నట్టైంది. వడ్డీ రూపేణే రావాల్సిన అదనపు రాబడిని కౌన్సిల్ నష్టపోతున్నది.
ఆమె నియామకమే ప్రశ్న.... ఏండ్ల తరబడి అక్కడే
ఒక ప్రభుత్వోద్యోగిని అటానమస్ సంస్థ అయిన కౌన్సిల్లో ప్రభుత్వ రూల్ ప్రకారం ఫారీన్ సర్వీస్ డిప్యూటేషన్ ద్వారా మాత్రమే నియమించాలి. కానీ, విద్యావతిని నిబంధనలకు విరుద్ధంగా నియమించినట్టు సమాచారం. చట్ట ప్రకారం రిజిస్ట్రార్ కాల పరిమితి ఐదేండ్లే. కానీ ఏడేండ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. రిజిస్ట్రార్గానే కాకుండా ఆమె హన్మకొండ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, జగిత్యాల నర్సింగ్ కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు.
దీంతో ఏ పోస్టుకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారనే వాదన ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు తయారు చేసినా, రిజిస్ట్రార్, డీఎంఈ వైఖరి కారణంగా నర్సింగ్ కౌన్సిల్ నుంచి విస్తృతమైన కార్యక్రమాలు జరగడం లేదనే విమర్శలున్నాయి. ప్రతి ఏటా విభాగాల వారీగా అయ్యే రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని చట్ట ప్రకారం గెజిట్‌లో ప్రచురించాలి. ఆ రిపోర్టును ప్రభుత్వానికి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌కు పంపాలి. ఆ సమాచారం ఆధారంగానే ప్రతీ ఏదేండ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ సమాచారం గెజిట్‌లో ప్రచురించలేదనే విమర్శలున్నాయి. ఎన్నికలూ నిర్వహించలేదు. చాలా మంది అర్హులున్నప్పటికీ ఒకే వ్యక్తికి ఇన్ని బాధ్యతలు అప్పగించడం, కొనసాగించడం వెనుక ఉన్న మతలబమేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆ శాఖలో కీలకమైన నర్సులకు సంబంధించిన వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని పలువురు కోరుతున్నారు.